రాజ‌ధాని అంశం ఇంకా వ‌ద‌ల‌ని టిడిపి.. స్వార్థం కోస‌మేనా ఈ ప్ర‌య‌త్నాలు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అంశంపై తెలుగుదేశం పార్టీ ఇంకా ఆశ‌లు పెట్టుకున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. రాజ‌ధాని అంశంపై ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం క్లారిటీ ఇచ్చినా ఇంకా రాజ‌ధాని చుట్టూ రాజ‌కీయాలు చేయాల‌ని చూస్తోంది తెలుగుదేశం. మ‌రి అమ‌రావ‌తి భూముల కుంభ‌కోణం విష‌యంలో ప్ర‌జ‌లను త‌ప్పుదోవ ప‌ట్టించేందుకు ఇలా చేస్తుందా అన్న అనుమానాలు కూడా క‌లుగుతున్నాయి.

ఏపీ రాజ‌ధాని విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఫుల్ క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర హైకోర్టులో కేంద్రం ఇదివ‌ర‌కు అఫిడ‌విట్ దాఖ‌లు చేసింది. రాజ‌ధాని అంశం ఆ రాష్ట్ర ప‌రిధిలోనికే వ‌స్తుంద‌ని దీంతో కేంద్రం ఎలాంటి జోక్యం చేసుకోద‌ని చెప్పింది. ఇంతటితో ఆగ‌కుండా మ‌రోసారి అద‌న‌పు అఫిడ‌విట్ కూడా దాఖ‌లు చేసింది. కేంద్ర ప్ర‌భుత్వం కేవ‌లం రాష్ట్రాలు ఏర్పాటు చేసుకునే రాజ‌ధానుల‌కు స‌హ‌కారం అందించేందుకు మాత్ర‌మే ఉంటాయ‌ని పేర్కొంది. అంతే త‌ప్ప రాజ‌ధాని విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కే అధికారం అని వివ‌ర‌ణ ఇచ్చింది.

అంత‌కుముందే ఏపీ ప్ర‌భుత్వం రాష్ట్రంలో మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై ప్ర‌తిప‌క్ష తెలుగుదేశం పార్టీ తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. అయితే కేవ‌లం అమ‌రావ‌తిలో జ‌రిగిన వేల ఎక‌రాల కుంభ‌కోణంలో భాగంగానే అమ‌రావ‌తినే రాజ‌ధానిగా చేయాల‌ని టిడిపి ప‌ట్టుబ‌డుతోంద‌ని ప్ర‌భుత్వం చెబుతోంది. అమ‌రావ‌తిలో జ‌రిగిన భూ కుంభ‌కోణంలో విచార‌ణ చేస్తోంది కూడా. అయితే దీనిపై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేప‌థ్యంలో విచార‌ణ ఆగిపోయింది. కాగా లోక్‌స‌భ‌లో టిడిపి ఎంపీ గ‌ల్ల జ‌య‌దేవ్ రాజ‌ధాని అంశంపై మాట్లాడారు. రాజ‌ధాని విష‌యంలో కేంద్ర‌మే తుది నిర్ణ‌యం తీసుకోవాల‌ని చెప్పారు. 248 అధిక‌ర‌ణం ప్ర‌కారం రాజ‌ధాని త‌ర‌హా అంశంలో కేంద్ర ప్ర‌భుత్వానికే అర్హ‌త ఉంటుంద‌న్నారు. అమ‌రావ‌తి నిర్మాణానికి కేంద్రం నిధులు కూడా ఇచ్చింద‌న్నారు. ఇప్పుడు కేంద్రం నిర్ణ‌యం తీసుకోక‌పోతే నిధులు, ప్ర‌జ‌ల‌కు జ‌వాబు ఎవ‌రు చెబుతార‌ని అడిగారు. రాజ‌ధాని అంశం కేంద్రం ప‌రిధిలోకి తీసుకొస్తూ నిర్ణ‌యం తీసుకోవాల‌ని లేదంటే.. ఇత‌ర రాష్ట్రాలు కూడా ఏపీలాగే చేస్తే కేంద్రం జోక్యం చేసుకోలేని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌న్నారు.

రాజ‌ధానిపై కేంద్ర హోంశాఖ క్లారిటీ ఇచ్చినా మళ్లీ తెలుగుదేశం ఎందుకు దీన్ని వ‌ద‌ల‌డం లేద‌న్న‌ది అర్థం కావ‌డం లేదు. ఇలా చేయ‌డం వ‌ల్ల ప్ర‌జ‌ల‌ను ఇంకా రెచ్చ‌గొట్టిన‌ట్లు అవుతుంద‌ని మేధావులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. స్వార్థ ప్ర‌యోజ‌నాల కోసం టిడిపి ఇలా చేస్తూ పోవడం మంచిదికాదంటున్నారు. అమ‌రావ‌తిలోని భూ కుంభ‌కోణం విచార‌ణ విష‌యంలో ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు సంకేతాలు ఇస్తూ రాజ‌ధానిగా అమ‌రావ‌తే కొన‌సాగాల‌న్న డిమాండ్ తెరమీద‌కు తేవాల‌ని టిడిపి యోచిస్తోంద‌ని పొలిటిక‌ల్ డిస్క‌ష‌న్ సాగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here