మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరతారన్న వార్తలు ఇప్పటివి కాదు. దాదాపు సంవత్సర కాలం నుంచి ఆయన టిడిపి వీడి వైసీపీలో చేరతారని అంటూనే ఉన్నా ఆయన మాత్రం ఇంకా టిడిపిలోనే కొనసాగుతున్నారు. కాగా ఇప్పుడు మరోసారి ఆయన వైసీపీలోకి వెళతారని ప్రచారం జరుగుతున్నా.. అందుకు పలువురు అడ్డుకుంటున్నారని తెలుస్తోంది.
గంటా శ్రీనివాసరావు ఈనెల 3వ తేదీనే వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి. ముందుగా ఆయన కుమారుడిని పార్టీలోకి పంపుతారని అంతా భావించారు. అయితే అనూహ్యంగా ఆ తేదీ కూడా ముగిసిపోయింది. కానీ గంటా మాత్రం సైలెంట్‌గానే ఉన్నారు. అయితే ఆయన వైసీపీలో చేరికపై పలు వార్తలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. గంటా వైసీపీలో చేరడానికి సిద్దంగా ఉన్నా వైసీపీ మాత్రం కాస్త ఆలోచిస్తుందట.
ఇప్పటికే పలు పార్టీలు తిరిగిన ఆయన ఇప్పుడు వైసీపీకి రావడంపై ఆ పార్టీ అధిష్టానం ఆలోచిస్తుందట. ఒకచోట నిలకడలేని రాజకీయ నాయకుడిని తీసుకోవాలా అన్నట్లు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. అయితే గతంలోనే వైసీపీ గంటాకు స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉందని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ తరహా లీకులు బయటకు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ లేదు. దీనికి తోడు కొద్ది రోజుల క్రితం గంటా బీజేపీతో కూడా మంతనాలు జరిపి చివరకు విరమించుకున్నారని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం వైసీపీ కూడా ఈయన విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోందని తెలుస్తోంది. మరి ఇప్పటికైనా గంటా శ్రీనివాసరావు వ్యవహారం ముగుస్తుందో ఏమవుతుందో చూడాలి.






