ఏపీలో తెలుగుదేశం ప‌రిస్థితి ఏంటి..

ఏపీలో తెలుగుదేశం పార్టీ ఖాలీ అయ్యే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే అర‌కొర నేత‌ల‌తో నెట్టుకొస్తున్న చంద్ర‌బాబు నాయుడుకు ఇక మీద‌ట అది కూడా క‌రువయ్యేట్లు ఉంది. తాజాగా ఆ పార్టీ నేతలు బీజేపీ వైపు చూస్తున్న‌ట్లు స‌మాచారం.

తెలుగుదేశం పార్టీ నేత‌, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్ ఆ పార్టీకి గుడ్‌బై చెప్ప‌బోతున్నారు. ఈ మేర‌కు ఆయ‌న బీజేపీలో చేర‌నున్నారు. రాష్ట్ర రాజ‌కీయాల్లో ఇప్పుడు ఇదే చ‌ర్చ న‌డుస్తోంది. ఇన్నాళ్లు తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకొని ఉన్న గ‌ల్లా జ‌య‌దేవ్ ఇక పార్టీని వీడేందుకు సిద్ధ‌మ‌య్యార‌ని జోరుగా పుకార్లు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇన్ని రోజులు పార్టీ మారకూడ‌ద‌ని అనుకుంటున్న ఈయ‌న ఇప్పుడు బీజేపీవైపు చూస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఏపీలో ఉన్న 25 లోక్‌స‌భ స్థానాల్లో 2019 ఎన్నిక‌ల్లో  22 వైఎస్ఆర్‌సిపి గెలుచుకోగా కేవ‌లం 3 లోక్ స‌భ స్థానాల్లోనే టిడిపి గెలిచింది. ఇందులో శ్రీ‌కాకుళం నుంచి రామ్మోహ‌న్ నాయుడు, విజ‌య‌వాడ నుంచి కేశినేని నాని, గుంటూరు నుంచి గ‌ల్లా జ‌య‌దేవ్‌లు గెలిచారు. గ‌ల్లా జ‌య‌దేవ్ కూడా అతి త‌క్కువ మెజార్టీతోనే విజ‌యం సాధించారు. ఆయ‌న‌కు వైసీపీ అభ్య‌ర్థి గ‌ట్టి పోటీ ఇచ్చారు. అయితే ఈ ఎంపీల్లో రామ్మోహ‌న్ నాయుడు కూడా పార్టీ మార‌తార‌ని వార్త‌లు వినిపించాయి. బీజేపీలో చేరి పోతే బెట‌ర‌ని ఆయ‌న అనుకుంటున్న‌ట్లు ప‌లువురు చ‌ర్చించుకున్నారు. కానీ ఆయ‌న ఇప్పుడు సైలెంట్‌గానే ఉన్న‌ట్టు తెలుస్తోంది.

ఇప్పుడు మ‌ళ్లీ గ‌ల్లా జ‌య‌దేవ్ టాపిక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆయ‌న బీజేపీలో చేరిపోవ‌డం ఖాయ‌మైన‌ట్లు క‌నిపిస్తోంది. ఈమేర‌కు బీజేపీ పెద్ద‌ల‌తో ఇప్ప‌టికే సంప్ర‌దింపులు కూడా పూర్త‌య్యాయ‌ని తెలుస్తోంది. మ‌రి అధికారికంగా ఎప్పుడు ప్ర‌కటిస్తారో వేచి చూడాలి. ఇక ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీ ఎంపీలు బీజేపీలో చేరిపోయారు. ఒకేసారి న‌లుగురు టిడిపిని వీడిన విష‌యం తెలిసిందే. టిజి వెంక‌టేష్‌, సుజ‌నా చౌద‌రి, సీఎం ర‌మేష్‌, గ‌రిక‌పాటి ఎప్పుడో బీజేపీ గూటికి వెళ్లిపోయారు.

కానీ గ‌ల్లా జ‌య‌దేవ్ మాత్రం ముందునుంచీ పార్టీ వీడ‌న‌ని అంటూనే ఉన్నారు. కానీ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాజ‌కీయ భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని టిడిపిని వీడాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇదే క‌నుక జ‌రిగితే గ‌ల్లా జ‌య‌దేవ్ బాట‌లోనే మ‌రికొంద‌రు ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా తెలుగుదేశం పార్టీని వీడ‌తార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అనుకుంటున్నారు. మ‌రి అంతా వెళ్లిపోయాక చంద్ర‌బాబు ద‌గ్గ‌ర లోకేష్‌, మిగిలిన ప‌లువురు స‌న్నిహిత నేత‌లు త‌ప్ప మ‌రెవ‌రూ ఉండ‌రు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here