స్లీప‌ర్‌సెల్స్‌కు ఆయుధాల స‌ర‌ఫ‌రా..

భార‌త్‌లో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్ర‌వాదులు ఎప్పుడు క‌న్నేసి ఉంటారు. ఈమేర‌కు ఇండియాలో కూడా స్లీప‌ర్ సెల్స్ దాగి ఉన్నార‌న్న స‌మాచారం భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు అందుతోంది. ఈ మేర‌కు వారిని క‌ట్ట‌డి చేసే ప‌నిలో ఇండియ‌న్ పోలీసులు సిద్దంగా ఉన్నారు. ఈ క్ర‌మంలో ఓ పోలీస్ వాహ‌నంపై గ్రెనెడ్ విసిరిన ఘ‌ట‌న జ‌మ్ముక‌శ్మీర్‌లో చోటుచేసుకుంది.

జ‌మ్ముక‌శ్మీర్ ఎప్పుడూ అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన ప్రాంతం. ఏ క్ష‌ణం ఏ ఉగ్ర‌వాది దాడి చేస్తారో అన్న కోణంలో అక్క‌డ భ‌ద్ర‌తా బ‌ల‌గాలు విధులు నిర్వ‌ర్తిస్తూ ఉంటాయి. నెల రోజుల వ్య‌వ‌ధిలోనే మూడు సార్ల‌కు పైగా ఇప్ప‌టికే ఉగ్ర‌వాదుల దాడులు ఇండియాలో వెలుగుచూశాయి. ఈ సారి ఏకంగా పోలీసు వాహనంపై గ్రెనెడ్‌ను ఓ ఉగ్ర‌వాది విసిరారు. అయితే అదృష్ట వ‌శాత్తు ఆ గ్రెనెడ్ పేలిపోలేదు. ఒక‌వేళ ఆ గ్రెనెడ్ పేలిపోయిఉంటే ప్రాణ‌న‌ష్ట‌మే జ‌రిగి ఉండేది.

ఉగ్రవాది పోలీసు వాహనంపై గ్రెనెడ్ విసిరిన ఘటన జమ్మూకశ్మీరులోని పూంచ్ జిల్లా కాలియా ప్రాంతంలో వెలుగుచూసింది. కాలియా వంతెన ప్రాంతంలో గురువారం రాత్రి పోలీసు వాహనం వెళుతుండగా దానిపై అనుమానిత ఉగ్రవాది గ్రెనెడ్ విసిరాడు. అయితే ఆ గ్రెనెడ్ పేలక పోవడంతో పోలీసులకు పెద్ద ప్రమాదం తప్పింది. గ్రెనెడ్ దాడితో పూంచ్ జిల్లాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పాకిస్థాన్ నుంచి సరిహద్దు జిల్లాలైన పూంచ్, రాజౌరీ ప్రాంత గ్రామాలకు ఆయుధాలు, మాదకద్రవ్యాలను తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం వచ్చింది. ఉగ్రవాద స్లీపర్ సెల్స్ కు ఆయుధాలు చేరవేస్తున్నారనే సమాచారం మేర భద్రతా బలగాలతో తనిఖీలు జరిపారు. గ్రెనెడ్ దాడి అనంతరం ఉగ్రవాదుల కోసం గాలింపును ముమ్మరం చేశారు.

జమ్మూ-కశ్మీరులోని పుల్వామా జిల్లాలోని ట్రాల్ ప‌ట్ట‌ణంలో వారం రోజుల క్రితం ఉగ్ర‌వాదులు భ‌ద్ర‌తా ద‌ళాల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డారు. ఓ సీఆర్‌పిఎఫ్ జ‌వానుపై గ్ర‌నేడ్ విస‌ర‌డంతో అత‌నికి గాయాల‌య్యాయి. అంతకు ముందు ఈ నెల 17వ తేదీన జమ్మూకశ్మీరులో లష్కరే తోయిబా ఉగ్రవాదుల రహస్య ఆయుధగారంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జేహలూం నదీ తీరానికి సమీపంలోని కావానీ గ్రామం వద్ద లష్కరేతోయిబా ఉగ్రవాదులు రహస్యంగా ఏర్ప‌ర‌చుకున్న ఆయుధ‌గారంలో ఐరన్ రాడ్లు, మందుగుండు సామాగ్రి, తుపాకులు, పిస్టళ్లు, ఏకే 47 తుపాకులు, మూడు గ్రెనెడ్లు లభించాయి. ఈ ఆయుధగారాన్ని పోలీసులు పేల్చివేశారు. నాలుగు రోజుల క్రితం జమ్మూకశ్మీరులోని అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు ఇన్‌స్పెక్టరు మృతి చెందిన విష‌యం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here