విజ‌య‌వాడ ఆల‌యంలో మూడు సింహాలు ఏమ‌య్యాయి..?

విజ‌య‌వాడ‌లోని దుర్గామ‌ల్లేశ్వ‌ర‌స్వామివార్ల దేవ‌స్థానంలో మూడు సింహాలు అదృశ్య‌మ‌వ్వ‌డం హాట్ టాపిక్‌గా మారింది. వెండి ర‌థానికి అమ‌ర్చిన నాలుగు సింహాల్లో మూడు క‌నిపించ‌డం లేద‌న్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశమైంది. ఈ విష‌యంపై ప్ర‌తిప‌క్షాలు తీవ్రంగా మండిప‌డుతున్నాయి. అస‌లేం జ‌రిగింద‌న్న దానిపై తక్ష‌ణ‌మే వివ‌రాలు బ‌య‌ట‌కు రావాల‌ని ప‌ట్టుప‌ట్టాయి.

ఏపీలో అంత‌ర్వేది ఘ‌ట‌న త‌ర్వాత దేవాల‌యాల భ‌ద్ర‌త‌పై ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. డీజీపీ కూడా రాష్ట్రంలోని పోలీసుల‌తో దీనిపై మాట్లాడారు. ఆల‌యాల్లో భ‌ద్ర‌త తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో మ‌ళ్లీ విజ‌య‌వాడ‌లో ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఆల‌యంలో గ‌త ఏడాది ఉగాది రోజున స్వామివారి ఉత్స‌వ మూర్తుల‌ను ఈ ర‌థంపైనే ఊరేగించారు. ఆ త‌ర్వాత క‌రోనా రావ‌డంతో ఊరేగింపు జ‌ర‌గ‌లేదు. దీంతో అప్ప‌టి నుంచి ర‌థాన్ని ముసుగుపెట్టి క‌ప్పి ఉంచిన‌ట్లు తెలుస్తోంది.

దీనిపై ఈవో సురేష్ మాట్లాడుతూ సింహాలు మాయం కాలేదని రికార్డులు పరిశీలిస్తామన్నారు. అంతర్వేది ఘటన జరిగింది కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్‌లు వస్తున్నాయని చెప్పారు. రికార్డుల పరిశీలన కోసం మూడు రోజుల సమయం కావాలని ఈవో తెలిపారు. అయితే వెండి సింహాలు ఉన్నాయో లేవో  చూసి చెప్పడానికి మూడు రోజులు సమయం ఎందుకని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం కాబట్టి భక్తులు, మీడియా ముందు రథాన్ని చూపించాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్  చేస్తున్నారు.

నేడు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోమువీర్రాజుతో పాటు ప‌లువురు నేత‌లు ఆల‌యానికి వెళ్లి ర‌థాన్ని ప‌రిశీలించారు. ఆల‌య అధికారుల నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ఈ ఘ‌ట‌న జ‌రిగింద‌న్నారు. నాలుగు సింహాల్లో నాలుగు ఉంటే ర‌థానికి ఉండాలి లేదంటే లాకర్లో ఉండాలి అలా కాకుండా ఇలా ఒక్క‌టి మాత్ర‌మే ఉండ‌టం ఏంట‌న్నారు. దీనిపై రాష్ట్ర ప్ర‌భుత్వం స‌మ‌గ్ర విచార‌ణ జ‌రిపించాల‌ని సోము వీర్రాజు అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here