పెద్ద మనసు చాటుకున్న టాలీవుడ్ హీరోలు..

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్‌ నగరం భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. మునుపెన్నడూ లేని విధంగా కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇళ్లల్లోనే ఉండిపోయారు. ఇక మరికొన్ని ప్రాంతాల్లో అయితే ఇళ్లు నీట మునగడంతో సర్వస్వం కోల్పోయారు. ఇప్పుడు హైదరాబాద్‌కు మళ్లీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో మరింతగా భయం పెరిగిపోతోంది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.550 కోట్లు ప్రకటించింది. అందరూ బాధితులను ఆదుకోవడానికి ముందుకు రావాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

ఈ పిలుపునకు స్పందించిన టాలీవుడ్‌ హీరోలు వరదల్లో సర్వస్వం కోల్పోయిన వారికి అండగా నిలవడానికి ముందుకొచ్చారు. ఈ క్రమంలోనే అక్కినేని నాగార్జున సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రూ.50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇక సూపర్‌ స్టార్‌ మహేష్‌, మెగాస్టార్‌ చిరంజీవి చేరో రూ. 1 కోటి ప్రకటించి తన పెద్ద మనసును చాటుకున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ తనవంతుగా రూ.50 లక్షలు ప్రకటించగా.. విజయ్‌ దేవరకొండ, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ రాధాకృష్ణ రూ. 10 లక్షల చొప్పున అందజేశారు. వీరితో పాటు దర్శకులు అనిల్ రావిపూడి – హరీష్ శంకర్ చెరో 5 లక్షల రూపాయలను విరాళంగా అందించనున్నట్లు తెలిపారు. వీరితో పాటు మంచు లక్ష్మీ – అక్కినేని సమంత వరద బాధితులకు ఆహారాన్ని అందిస్తున్నారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమకు కేంద్రమైన హైదరాబాద్‌ నగరానికి సినీ తారలు తమ వంతు సాయాన్ని అందిస్తూ పెద్ద మనసు చాటుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here