ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి రాజీనామా చేయాలని వాళ్లు అంటున్నారు..

దేశ వ్యాప్తంగా బీజేపీ బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న విష‌యం తెలిసిందే. ఇదే స‌మయంలో ఇత‌ర పార్టీలు కూడా త‌మ ఆధిక్యాన్ని ప్ర‌దర్శించ‌డానికి రెడీ అవుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దేశంలోని ఇత‌ర రాష్ట్రాల‌లో సీట్లు సంపాదించుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం మాట్లాడుతూ, ఉత్తర ప్రదేశ్ ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్నవారి సంఖ్య ఢిల్లీ జనాభాతో సమానంగా ఉందన్నారు. దీనికి ఆప్ కౌంట‌ర్ ఇస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ ఉత్తర ప్రదేశ్‌పై దృష్టి పెట్టింది. 2022లో జరిగే శాసన సభ ఎన్నికల్లో తన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆ రాష్ట్రంలోని ప్రజల సమస్యలపై గళమెత్తుతోంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ శిశోడియా శనివారం ట్విటర్ వేదికగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై విమర్శలు గుప్పించారు. అత్యధిక జనాభాగల ఉత్తర ప్రదేశ్‌లో బాలలకు సరైన విద్యను అందించలేకపోతే, పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్‌ను ఉద్దేశించి మనీశ్ శిశోడియా ఇచ్చిన ట్వీట్‌లో, ఇటువంటి సాకులు చెప్పడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. అధిక జనాభాగల ఉత్తర ప్రదేశ్ బాలలకు సరైన విద్యను అందజేయలేకపోవడం యోగి అసమర్థత అని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజల తప్పు ఏమిటని ప్రశ్నించారు. ఈ పరిస్థితిని చక్కదిద్దలేకపోతే పదవిని వదిలి వెళ్ళిపోవాలన్నారు. పెద్ద రాష్ట్రంలో పిల్లలకు మంచి విద్యను అందించగలిగిన సమర్థుడిని ప్రజలు ఎంపిక చేసుకుంటారన్నారు. మనీశ్ శిశోడియా వ్యాఖ్యలను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా సమర్థించారు. మంచి ప్రభుత్వాలు సాకులు చెప్పకూడదన్నారు. జనాభా 5 లక్షలున్నా, 5 కోట్లు ఉన్నా, బాలలకు మంచి విద్యను, మంచి భవిష్యత్తును అందించవలసిన బాధ్యత ప్రభుత్వాలకు ఉంటుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here