భార‌త్‌లో క‌రోనా టీకా తీసుకోబోయే 30 కోట్ల మంది వీరే..

ఇండియాలో క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్ కోసం తీవ్రంగా క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి. ప్ర‌జ‌లంద‌రికీ టీకా ఇచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం వేగంగా చ‌ర్య‌లు ప్రారంభించింది. మొద‌టి విడ‌త‌గా ఎంపిక చేసిన వారికి మాత్ర‌మే టీకాను ఇవ్వ‌నున్నారు.

తొలి విడతలో భాగంగా ప్రాధాన్య వర్గానికి(ప్రయారిటీ) 30 కోట్ల మందికి టీకా ఇవ్వనున్నట్టు కేంద్ర అధికారులు చెబుతున్నారు. ఫేజ్-1 కోసం ఏకంగా రూ. 10 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నట్టు సమాచారం. ఈ ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించనున్నట్టు తెలుస్తోంది. టీకా కార్యక్రమం కోసం అంతర్జాతీయ సంస్థల సహాయం తీసుకునేందుకు ప్రభుత్వం సుముఖంగా లేదని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. కరోనా టీకా ఉచితంగా ఇస్తామంటూ బీహార్, కేరళ రాష్ట్రాలు ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో ఇతర రాష్ట్రాలు కూడా ఇదే తరహా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తొలి విడతలో టీకా పొందే ప్రాధాన్య వర్గాలను జాతీయ టీకా నిపుణుల బృందం ఇప్పటికే గుర్తించింది. కరోనా వారియర్స్ అయిన వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ఇతర అత్యవసర సిబ్బంది, దీర్ఘ కాలిక రోగాలతో అవస్థ పడుతున్న 50ఏళ్లు పైబడి వారు తొలి విడతలో టీకా పొందుతారు. వీరిలో ఆరోగ్య సిబ్బంది సంఖ్య 1 కోటి కాగా.. అత్యవసర సిబ్బంది సంఖ్య 2 కోట్లు, వృద్ధుల సంఖ్య 27 కోట్లకు పైబడి ఉండొచ్చని తెలుస్తోంది.

అత్యవసర అనుమతుల కోసం ప్రస్తుతం ఫైజర్, భారత్ బయోటెక్(కొవ్యాక్సిన్ టీకా), సిరమ్ ఇన్‌స్టిట్యూట్‌లు(కోవీషీల్డ్ టీకా) రేసులో ఉన్నాయి. అయితే ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా డిజైన్ చేసిన కోవిషీల్డ్‌ టీకాకే మొదట అనుమతి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి ఏకంగా 50 కోట్ల కోవీషీల్డ్ టీకా డోసులను సిద్ధం చేస్తామని సీరం ఇన్‌స్టిట్యూట్ ఇదివరకే ప్రకటించింది. అయితే..తొలి విడతలో 30 కోట్ల మందికి టీకా ఇచ్చేందుకు భారత్‌కు 60 కోట్ల డోసులు అవసరమవుతంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here