రాబోయే ఐదు సంవ‌త్స‌రాలు అత్యంత జాగ్ర‌త్త‌గా ఉండాలి..

ప్ర‌పంచ దేశాలు మొత్తం ఇప్పుడు కేవ‌లం క‌రోనా పైనే దృష్టి పెట్టాయి. అయితే ఇదే స‌మ‌యంలో ఇత‌ర వ్యాధులు త‌మ ప‌ని తాము చేసుకుపోతున్నాయి. అంటే క‌రోనా కాకుండా ఇత‌ర రోగాల‌న్నీ విజృంభిస్తున్నాయని అంచ‌నా వేస్తున్నారు. రాబోయే ఐదు సంవ‌త్స‌రాల్లో టిబి, మ‌లేరియా వ్యాధులు ప్ర‌బ‌లే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌న్న శాస్త్ర‌వేత్త‌ల మాట‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి.

టీబీ, మలేరియాలను 2030 నాటికల్లా కట్టడి చేయాలన్న లక్ష్యం పట్టాల తప్పేలా కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో రాబోయే ఐదేళ్లలో టీబీ మరణాల రేటు 20 శాతం, మలేరియా మరణాల రేటు 36 శాతం మేరకు పెరిగే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంచనావేస్తున్నారు. మనదేశంలో టీబీ, మలేరియా కేసులు అధికంగా ఉన్నాయి. దీంతో భారత్‌లోనూ ఈ ముప్పు పొంచివుంది. నిజానికి 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా టీబీ, మలేరియా బాధితుల సంఖ్యను 80 శాతం తగ్గించాలని, ఈ వ్యాధుల కారణంగా సంభవించే మరణాలను 90 శాతం వరకూ తగ్గించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.

ఈ లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని 2015 మొదలుకొని అందుకు తగిన చర్యలు చేపడుతున్నారు. అయితే గడచిన ఐదేళ్లలో అనుకున్న స్థాయిలో లక్ష్యం నెరవేరలేదు. స్తుతం ప్రపంచమంతా కోవిడ్-19 కట్టడిలో మునిగివున్నందున టీబీ, మలేరియా నియంత్రణ లక్ష్యానికి గండిపడే అవకాశాలున్నయని లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ రిపోర్టులో వెల్లడయ్యింది. 2020 నాటికి టీబీ కేసులను 20 శాతానికి, మరణాల సంఖ్యను 25 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకూ టీబీ కేసులను 9 శాతానికి, మరణాల సంఖ్యను 14 శాతం వరకూ మాత్రమే తగ్గించగలిగారు.

ఇదిలావుండగా ఆఫ్రికాలో మలేరియా బాధితుల సంఖ్య ఇటీవలి కాలంలో మరింతగా పెరిగింది. లాన్సెట్ రిపోర్టును అనుసరించి ప్రస్తుత కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా టీబీ, మలేరియా మరణాల సంఖ్య పెరిగింది. ఇక మలేరియా విషయానికొస్తే 2020 నాటికి 40 శాతం తగ్గుదల లక్ష్యంగా ఉండగా, 10 శాతానికే ఇది సాధ్యమయ్యింది. గడచిన ఐదేళ్లలో భారత్‌లో మలేరియా అదుపునకు తీసుకున్న చర్యలు ఫలితమివ్వడం లేదని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here