జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు.. ఉగ్ర‌వాదుల దాడుల్లో ఇన్‌స్పెక్ట‌ర్ మృతి..

జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్నారు. అవ‌కాశం దొరికితే దాడులు చేసేందుకు తెగ‌బ‌డుతున్నారు. తాజాగా అనంత్‌నాగ్ జిల్లాలో ఉగ్ర‌వాదులు జ‌రిపిన కాల్పుల్లో ఓ పోలీస్ అధికారి ప్రాణాలు కోల్పోయారు.

స‌రిగ్గా రెండు రోజుల క్రితం జమ్మూ-కశ్మీరులోని పుల్వామా జిల్లాలోని ట్రాల్ ప‌ట్ట‌ణంలో ఉగ్ర‌వాదులు భ‌ద్ర‌తా ద‌ళాల‌పై దాడుల‌కు పాల్ప‌డ్డారు. ఓ సీఆర్‌పిఎఫ్ జ‌వానుపై గ్ర‌నేడ్ విస‌ర‌డంతో అత‌నికి గాయాల‌య్యాయి. అంతకు ముందు ఈ నెల 17వ తేదీన జమ్మూకశ్మీరులో లష్కరే తోయిబా ఉగ్రవాదుల రహస్య ఆయుధగారంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద జేహలూం నదీ తీరానికి సమీపంలోని కావానీ గ్రామం వద్ద లష్కరేతోయిబా ఉగ్రవాదులు రహస్యంగా ఏర్ప‌ర‌చుకున్న ఆయుధ‌గారంలో ఐరన్ రాడ్లు, మందుగుండు సామాగ్రి, తుపాకులు, పిస్టళ్లు, ఏకే 47 తుపాకులు, మూడు గ్రెనెడ్లు లభించాయి. ఈ ఆయుధగారాన్ని పోలీసులు పేల్చివేశారు.

తాజాగా జమ్మూకశ్మీరులోని అనంత్ నాగ్ జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు ఇన్‌స్పెక్టరు మృతి చెందారు. అనంత్ నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీరు పోలీసులు గాలిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో జమ్మూకశ్మీరు విభాగానికి చెందిన పోలీసు ఇన్‌స్పెక్టరు ముహమ్మద్అష్రఫ్ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన అష్రఫ్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశారు. షోపియాన్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటరులో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతమయ్యారు.

షోపియాన్ జిల్లా మెల్ హోరా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించి ఉంటారని జమ్మూకశ్మీర్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా జ‌మ్ముక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదులు, భద్ర‌తా ద‌ళాల‌కు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణ‌మే నెల‌కొంది. అయితే ఉగ్ర‌వాదుల‌ను ప‌ట్టుకునేందుకు అన్ని విధాలా జ‌వాన్లు అప్ర‌మ‌త్తంగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here