మోడీ పరువును గంగపాలు చేస్తున్న తెలంగాణ బీజేపీ నేతలు

దక్షిణాదిన పాగా వేయాలనుకున్న  కమలదళం నేతల మధ్య కోల్డ్ వారే కొంపముంచు తోందా? ఇద్దరు నేతల మధ్య పైకి కనపడని విభేదాలు సైలెంట్ గా పార్టీ పరువు తీసేస్తున్నాయా? ఈ కోపరేషన్లో నాన్ కోపరేషన్ మతలబేంటి? తెలంగాణ కమలంలో కల్లోలం ఎందుకు రేగుతోంది?
తెలంగాణలో కమలం విరబూయాలని అగ్రనేతలు ఆరాటపడుతుంటే.. ఇక్కడ మాత్రం కనిపించని కోల్డ్ వార్ పార్టీని కమ్మేస్తోంది.పార్టీకి మోడల్ గా నిలబడాల్సిన వ్యక్తులే ఎడమొఖం, పెడమొఖంలా వ్యవహరించడంతో కిందిస్థాయి కేడర్ జుట్టు పీక్కుంటోంది.
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్.. పార్టీపై పట్టుకోసం శత విధాల ప్రయత్నిస్తున్నారు. జిల్లాల వారీగా పర్యటించి పార్టీని పటిష్టపరచడానికి ట్రై చేస్తున్నారు.
ఈయన బిజెపి మాజీ అధ్యక్షుడు.. తెలంగాణ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్.. మాజీ అధ్యక్షుడు కావడం వల్ల జిల్లాల్లో ఆయనకు మంచి పట్టు ఉంది.. ఆ పట్టునే ఆధారంగా చేసుకుని సైలెంట్ గా చక్కబెట్టుకు పోతున్నారు.  ఇలా నేతలిద్దరూ ఎవరికి వారే అన్న తీరులోఉంటే.. పార్టీ కేడర్ అయోమయంలో పడిపోతోంది.. ఈగందరగోళం ఏంటో అర్ధం కాక తలలు పట్టుకుంటోంది. బిజెపి నేత కిషన్ రెడ్డి ఈమధ్య సింగరేణి జల్లా టూర్ పెట్టుకున్నారు. కార్మికుల సమస్యలను చర్చిస్తానంటూ పార్టీ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకుండానే తన టూర్ డేట్ ఫిక్స్ చేసేసుకున్నారు.. జిల్లాల నేతలతో చెప్పకుండా టూర్ ఎలా పెట్టుకుంటారంటూ లక్ష్మణ్ కిషన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. అధ్యక్షుడి కోపంతో కంగారు పడిన కేడర్ కిషన్ రెడ్డికి బొగ్గు గనుల పర్యటనకు ఏర్పాట్లుచేసి పార్టీ అధ్యక్షుడికోసం కార్మికులతో సదస్సు ఏర్పాటు చేశారు.. ఇలా ఇద్దరు నేతలనూ బుజ్జగించేందుకు ట్రై చేస్తున్నారు..
కానీ ఈ అంశంపై అధ్యక్షుడు లక్ష్మణ్ మాత్రం సీరియస్ గా ఉన్నారు.. కిషన్ రెడ్డి కార్యక్రమానికి భారీ ఏర్పాట్లు చేసి తనకి మాత్రం తూతూ మంత్రంగా తేల్చేశారంటూ మండిపడ్డారు.
కిషన్ రెడ్డితో కలసి పనిచేసిన నేతలకు లక్ష్మణ్ టీమ్ లో చోటు దొరక లేదు.. దాంతో వారు కిషన్ రెడ్డితోనే కలసి కార్యక్రమాలు పెట్టుకుని జనంలో తిరుగుతున్నారు.
ఈ సీన్ జిల్లాలకే పరిమితం కాదు. నగరంలోనూ ఇదే తంతు.. చివరకు అసెంబ్లీలోనూ నేతలిద్దరిదీ చెరో దారే.. ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి.. చాలా సందర్భాల్లో అధ్యక్షుడికి అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీలో సైతం తానే మాట్లాడేస్తున్నారు.. అప్రాప్రియేషన్ బిల్లు రోజు మినహా లక్ష్మణ్ కు మాట్లాడే అవకాశం రాలేదు. ఇక అసంబ్లీ సమావేశాల టైమ్ లో ప్రభుత్వాన్ని విమర్శించడంలోనూ నేతలిద్దరిదీ చెరో దారి.. మీడియా మీట్ పెట్టి లక్ష్మణ్ విమర్శిస్తే.. ఆ మరుసటి రోజు కిషన్ రెడ్డి సెపరేట్ గా మళ్లీ ప్రభుత్వాన్ని తిడతారు. ఇలా విషయం ఒకటే..కానీ ఇద్దరూ ఎవరిదారిన వాళ్లు స్పందిస్తున్నారు. తాజాగా పార్టీ కార్యాలయంలోపార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజునా అదే జరిగింది. కిషన్ రెడ్డి వచ్చేలోపే లక్ష్మణ్ కార్యక్రమాన్ని పూర్తి చేసి చేతులు దులిపేసుకుంటే.. విషయం తెలుసుకున్న కిషన్ రెడ్డి అంబర్ పేట్ లోనే పార్టీ ఆవిర్భావ కార్యక్రమం పూర్తి చేసుకుని జెండా పండగకి డుమ్మా కొట్టారు. ఇలా ఏ అంశమైనా.. ఇద్దరిదీ చెరో దారి.. దక్షిణాదిన పాగా వేయాలనుకుంటున్న కాషాయదళంలో ఆధిపత్య పోరు ఈ రేంజ్ లో ఉంటే ఇక గెలుపు ఎలా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here