రైతుల విష‌యంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన తేజ‌స్వీయాద‌వ్‌..

దేశ రాజ‌ధానిలో రైతులు ఆందోళ‌న‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా రైతుల‌కు మ‌ద్ద‌తు రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే బీహార్‌లో కూడా ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వీయాద‌వ్ రైతుల‌కు సంఘీభావంగా నిర‌స‌న‌లు చేప‌ట్టారు. రైతుల కోసం ఏం చేయ‌డానికైనా సిద్ద‌మ‌ని వ్యాఖ్య‌లు చేశారు.

తనతో పాటు మహాఘట్ బంధన్ నేతలపై నితీశ్ సర్కార్ కేసులు నమోదు చేయడంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్రంగా మండిపడ్డారు. నితీశ్ సర్కార్‌కు దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని సవాల్ విసిరారు. కోవిడ్ సమయంలో పోలీసుల అనుమతి తీసుకోకుండా నిరసన ప్రదర్శనలు నిర్వహించడంపై తేజస్వీతో పాటు మరో 500 మంది మహాఘట్ బంధన్ నేతలపై పాట్నా పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే తేజస్వీ యాదవ్ దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.

‘‘ఓ పిరికిపంద సీఎం నేతృత్వంలో ఈ ప్రభుత్వం నడుస్తోంది. రైతులకు మద్దతుగా గొంతెత్తినందుకు తమపై కేసులు నమోదు చేశారు. మీకు నిజంగా అధికారమంటూ ఉంటే… మమ్మల్ని అరెస్ట్ చేయండి. లేదంటే నేనే లొంగిపోతా. రైతుల కోసం ఉరికి కూడా సిద్ధమే’’ అని తేజస్వీ యాదవ్ ప్రకటించారు. మరోవైపు ఆర్జేడీ కూడా స్పందించింది. తప్పుడు ఆరోపణలు చేస్తూ నితీశ్ ప్రభుత్వం తమపై తప్పుడు కేసులు బనాయిస్తోందని మండిపడింది. రైతుల కోసం ఇలాంటి వెయ్యి కేసులైనా ఎదుర్కోడానికి తాము సిద్ధంగానే ఉంటామని ఆర్జేడీ ఓ ప్రకటనలో పేర్కొంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here