దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కెరీర్‌లో ఉత్తమ చిత్రాల్లో ‘పెళ్లి సందడి’ ఒకటనే విషయం తెలిసిందే. 1996లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా రాఘవేంద్రరావు ఈ చిత్రానికి సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన స్వయంగా ప్రకటించారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. రోషన్‌కు ఒక మంచి విజయాన్ని అందివ్వాలనుకుంటున్న శ్రీకాంత్ దర్శకేంద్రుడితో ఇందుకు ఒప్పించాడని సమాచారం. పెళ్లి పందిరి చిత్రం శ్రీకాంత్ కెరీర్‌కు ఎంతో దోహదపడింది. ఇక రోషన్ ఇదివరకు నాగార్జున నిర్మించిన నిర్మలా కాన్వెంట్ చిత్రంతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా విజయాన్ని అందుకోలేక పోయినా.. రోషన్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. మరి తండ్రి చేసిన సినిమా సీక్వెల్‌లో తనయుడు నటిస్తాడా? లేదా తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.






