ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కోసం రూ. 8400 కోట్ల పెట్టి విమానం కొనుగోలు చేయడంపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసి విమానం తీసుకురావాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. కాగా జవాన్లకు మాత్రం ఏ స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తున్నారన్నారు.
కొందరు జవాన్లు మాట్లాడుకుంటున్న ఓ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ వీడియోను రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ వీడియోలో ఏముందంటే.. సీనియర్లు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వాడుతూ మన్నలి ట్రక్కుల్లో తీసుకొని వెళుతున్నారు. అధికారులు మనతోనూ, మన కుటుంబ సభ్యుల ప్రాణాలతోనూ ఆటలాడుకుంటున్నారని ఉంది. దీన్ని పోస్టు చేసిన రాహుల్… ప్రభుత్వంపై మండిపడ్డారు. జవాన్లను నాన్ బుల్లెట్ ప్రూఫ్ ట్రక్కుల్లో తీసుకెళుతూ వారిని అమరులను చేస్తున్నారన్నారు. కానీ ప్రధాని కోసం మాత్రం రూ. 8400 కోట్లు పెట్టి విమానాన్ని కొనుగోలు చేశారన్నారు.
ఇదేం న్యాయమని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రపతి, ప్రధాని వంటి వీవీఐపీల ప్రయాణాల కోసం అత్యాధునికి విమానాలు కొనుగోలు చేయడంపై ఆయన మండిపడ్డారు. సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్ల కోసం ఖర్చు చేస్తే ఎన్నో మంచి సౌకర్యాలు సైన్యం పొందుతుందన్నారు. కాగా రాహుల్ గాంధీ ఇలా మాట్లాడటం ఇదే మొదటిసారేం కాదు. గతంలో కూడా ఆయన విమానాల కొనుగోలుపై మండిపడ్డారు. మరి ఈ వివాదం ఇంతటితో ముగుస్తుందో లేదో అన్నది వేచి చూడాలి.