అయోమ‌యంలో ర‌జ‌నీ!!

రజనీ బాబా.. రాజకీయ అరంగేట్రంపై ఇప్పటికీ దోబూచులాటే.. ఆ దేవుడు ఆదేశిస్తాడు.. ఈ బాబా పాటిస్తాడు అంటూ తమిళ్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికీ నర్మ గర్భంగానే మాట్లాడుతున్నారు.. రజనీ రాజకీయాల్లోకి రావాలని, లేదా బిజెపిలోచేరాలని కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ ఆహ్వానంపై కూడా స్పందించలేదు.
మూడు రోజుల పాటూ ఫ్యాన్స్ తో ముచ్చటించిన మెగా స్టార్ తన రాజకీయ ప్రవేశంపై ఎప్పటిలాగేనే సస్పెన్స్ కంటిన్యూ చేశారు.
గత తొమ్మిదేళ్లుగా రజనీ రాజకీయ ప్రవేశంపై పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి.రజనీ రాజకీయాల్లోకి రావాలంటూ అటు బిజెపి కూడా ఒత్తిడి తెస్తోంది.రజనీ కామెంట్లు చూసిన వారు.. సినిమాలకు గుడ్ బై చెప్పి.. రజనీ బాబా రాజకీయాల్లోకి అడుగుపెడతారని అనుమానిస్తుంటే.. మరికొందరు.. బిజెపి ఒత్తిడిని తట్టుకోడానికే రజనీ అలా మాట్లాడాడని విశ్లేషిస్తున్నారు.
తమిళనాడులో బిజెపి మద్దతుతో రజనీ కొత్త పార్టీ పెడతాడని, 2019 ఎన్నికల నాటికి ఆపార్టీ రెడీ అవుతుందనీ పుకార్లు బలపడ్డాయి. జయ మరణం తర్వాత రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితి, శూన్యతకు రజనీ ఎంట్రీతో చెక్ పడుతుందని  మరికొందరు విశ్లేషకులు కూడా అంచనా వేశారు..  తమిళనాడులో జయ బతికున్నంత వరకూ అన్నా డిఎంకె పార్టీకి ఎదురే లేకుండా పోయింది..కానీ ఆమె మరణానంతరం అన్నా డిఎంకె నిలువునా చీలిపోయింది. వర్గ పోరుతో పార్టీ పలుచన పడింది.
రాను రాను అంటూనే రాజకీయాలు మాట్లాడారు రజనీకాంత్. అభిమానులతో మూడు రోజుల ముచ్చట్లలో 20ఏళ్ల క్రితం డిఎంకె సంకీర్ణానికి మద్దతు పలకడం పట్ల విచారం వ్యక్తంచేశారు.. అది తాను చేసిన అతిపెద్ద పొరపాటుగా పేర్కొన్నారు.. అప్పట్లో తమిళనాట జయను గెలిపిస్తే రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేడంటూ రజనీ ఘాటుగా వ్యాఖ్యానించారు..  ఆదెబ్బకు డిఎంకె సంకీర్ణం ఎన్నికల్లో బంపర్ మెజారిటీ తో గెలిచింది.జయలలిత ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు.. రజనీ మాటకు విలువెంత అన్నడానికి ఈ ఒక్క సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ.
20ఏళ్ల క్రితం చేసిన పొరపాటును సరిదిద్దుకున్నానని.. తన పేరును చాలామంది చాలా రకాలుగా వాడుకున్నారని.. అనేక సందర్భాల్లో తన పేరును దుర్వినియోగం చేశారనీ తలైవా వ్యాఖ్యానించారు..డిఎంకె అధినేత స్టాలిన్ కూడా రజనీ రాజకీయాల్లోకి రావాలని ఫాన్స్ కోరుకుంటున్నారని.. రావాలా వద్దా అన్నది ఆయన తేల్చుకోవాలనీ కామెంట్ చేశారు.
చెన్నయ్ లోని రాఘవేంద్ర వెడ్డింగ్ హాల్ లో ఫాన్స్ తో రజనీ భేటీ మూడరోజు కూడా ఉత్సాహంగా సాగింది. మూడు వేలమంది అభిమానులు తరలి రాగా.. వారందరూ సుదీర్ఘంగా క్యూలోనిలబడి మెగాస్టార్ తో ఫోటోకోసం ఎదురు చూడటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here