తిరుమల తిరుపతి దేవస్థానం వద్ద 50 కోట్ల పాత నోట్లు

కరోనా కారణంగా పడిపోయిన ఆదాయాన్ని ఎలాగోలా ఇతర వనరుల ద్వారా సమకూర్చుకోవాలనుకుంటున్న టీటీడీ చైర్మన్‌కు.. పాత నోట్లు.. గుట్టల్లా పడి ఉండటం కనిపించాయి. వాటి విలువ రూ. యాభై కోట్ల వరకూ ఉంటుందని తెలియడంతో.. ఆయన నేరుగా ఢిల్లీకి వెళ్లిపోయారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అపాయింట్‌మెంట్ తీసుకుని.. తన విజ్ఞాపనను.. ఆమె ముందు పెట్టారు. టీటీడీ వద్ద రూ. యాభై కోట్ల పాత నోట్లు ఉన్నాయని.. వాటిని కేంద్రం తీసుకుని.. రూ. యాభై కోట్ల కొత్త నోట్లు ఇవ్వాలని కోరారు. నోట్లే ఇవ్వాల్సిన పని లేదు.. బ్యాంక్‌లో ట్రాన్స్‌ఫర్ చేసినా చాలనేది ఆయన ఉద్దేశం. లాక్ డౌన్ వల్ల.. టీటీడీకి ఆదాయంపడిపోయిందని, కష్టాల్లో ఉన్న సంస్థను ఆదుకోవాలని వైవీ సుబ్బారెడ్డి కోరుతున్నారు.
భక్తులు ఇచ్చే కానుకలను డబ్బు రూపంలో మార్చేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. నోట్ల రద్దు సమయంలో.. తిరమల శ్రీవారికి పెద్ద ఎత్తున పాత నోట్లను భక్తులు సమర్పించుకున్నారు. అయితే.. కేంద్రం.. ఆ పాతనోట్లను.. ఓ సమయం వరకే మార్పిడి చేసింది. శ్రీవారి హుండీలో వేసిన వాటికి లెక్కలు లేకపోయినప్పటికీ.. ఎంత వచ్చినా… మార్పిడి చేసింది. సమయం ముగిసిన తర్వాత.. కఠినమైన నిబంధనలు అమలు చేస్తోంది. పాత నోట్లు ఎవరి వద్ద ఉన్నా.. కేసులు నమోదు చేయాలని చట్టం కూడా తెచ్చింది. అయితే.. ఆ గడువు ముగిసిన తర్వాత కూడా శ్రీవారి హుండీలో పాత నోట్లను కొంత మంది భక్తులు వేస్తూ వచ్చారు.

అలా ఇప్పటికి రూ. యాభై కోట్ల వరకూ పోగుపడ్డాయి. కానీ.. వాటిని మార్చుకునే అవకాశం మాత్రం లేకుండా పోయింది. గతంలో… టీటీడీ చేసిన విజ్ఞప్తిని ఆర్బీఐ కూడా పట్టించుకోలేదు. అప్పట్లో ఆదాయం దండిగా ఉండటంతో.. ఆ నోట్లను మార్పిడి చేసేందుకు సీరియస్‌గా ప్రయత్నించలేదు. ఇప్పుడు.. ఆ యాభై కోట్లు.. మార్పిడి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరి నిర్మలా సీతారామన్ కనికరిస్తారో లేదో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here