రాజకీయంగా ఎదుర్కోలేకనే కాంగ్రెస్ విమర్శలు..మంత్రి జూపల్లి

రాజకీయంగా తనను ఎదుర్కోలేకనే కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. అందుకే తన పిల్లలను టార్గెట్ చేస్తున్నారని తెలిపారు . జూపల్లి కుమారులు తీసుకున్న బ్యాంకు రుణాలపై సీబీఐ నోటీసులు పంపించిందని సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు.ఇవాళ టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు..

తనను నీరవ్ మోడీతో పోల్చడానికి కాంగ్రెస్ నేతలను సిగ్గుండాలని అన్నారు. తన పిల్లల ప్రతిష్ఠను దెబ్బతీసి వాళ్లు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారన్నారు. పిల్లల భవిష్యత్‌ను నాశనం చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా నాయకుల అడుగులకు మడుగులొత్తిన చరిత్ర తెలంగాణ కాంగ్రెస్ నేతలదని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవిని తాను వదులుకున్నానని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఒకవేళ నా కుమారుడు వరుణ్ కంపెనీ తీసుకున్న రుణం చెల్లించాల్సి ఉండవచ్చు, ఆలస్యం జరిగితే వడ్డీ పెరుగుతుంది. దాన్ని కూడా కట్టక తప్పదు. పైగా నా కుమారుడు మేజర్. అతడి వ్యాపారం అతడు చేసుకుంటున్నాడు. దానితో నాకేం సంబంధం? అని మంత్రి జూపల్లి ప్రశ్నించారు. బ్యాంకు నుంచి రూ.60 కోట్లు రుణం తీసుకుని రూ.31 కోట్లు కట్టినప్పటికీ ఎక్కడ కూడా దాని ఊసెత్తకుండా, బ్యాంకును ముంచినట్టు ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. విలువలకు కట్టుబడి రాజకీయాల్లో అంచెలుఅంచెలుగా తాను ఎదిగినట్టు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here