ఏపీ ప్ర‌భుత్వంపై మండిప‌డిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌హిళ‌ల‌పై దాడులను జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఖండించారు. ఏపీ ప్ర‌భుత్వంపై ఆయ‌న మండిప‌డ్డారు. ఆడ పిల్ల‌ల‌కు ర‌క్ష‌ణ లేని చ‌ట్టాలు ఎందుక‌ని ప‌వ‌న్ ప్ర‌శ్నించారు.

విజయవాడలో ప్రేమోన్మాది దాడిలో దివ్య తేజస్విని అనే యువ‌తి బలికావడంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తీవ్ర ఆవేదన చెందారు. దివ్య తేజస్విని హత్యపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ఆడ బిడ్డలకు రక్షణ ఇవ్వని చట్టాలు చేసి ప్రయోజనం ఏమిటన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని ఓ ప్రేమోన్మాదికి బలైపోయిందని తెలిసి ఎంతో బాధపడిన‌ట్లు ప‌వ‌న్ చెప్పారు. ఉన్నత విద్యను పూర్తి చేసుకొని జీవితంలో స్థిరపడాలని ఆశలతో ఉన్న తమ బిడ్డ హత్యకు గురికావడం కన్నవారికి గర్భశోకాన్ని మిగులుస్తుందన్నారు.

రాష్ట్రంలో విద్యార్థినులు, యువతులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల కేసులు పెరుగుతుండటం దురదృష్టకరమ‌న్నారు.. దిశ చట్టం చేశాం అని ప్రచారం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టం ద్వారా ఏం సాధించిందన్నారు. ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వని చట్టాలు చేసి ప్రయోజనం ఏమిటన్నారు. ఇటీవల తిరుపతిలో ఓ యువతిపై ఒక మత ప్రచారకుడు లైంగిక దాడికి పాల్పడ్డ ఘటనపై కేసు నమోదు చేయకపోతే ఆ బాధితురాలు స్పందనలో ఫిర్యాదు ఇచ్చుకోవాల్సి వచ్చిందన్నారు. పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించి.. మహిళల రక్షణ కోసం చట్టాన్ని బలంగా ప్రయోగించాలన్నారు. నిందితులకు కఠిన శిక్షలు విధించినప్పుడే.. మహిళలకు తమ రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలపై నమ్మకం కలుగుతుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here