బాబు భజన బృందానికి జలీల్ ఖానే గ్యాంగ్ లీడర్

దేశంలోనే మొట్టమొదటిసారిగా బీకాంలో ఫిజిక్స్ చదివిన టీడీపీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, పబ్లిసిటీలో కిక్కే వేరప్పా అంటున్నారు. మీడియాలో నానేందుకు లెక్కలేనన్ని తిక్క స్టేట్ మెంట్స్ ఇవ్వాలని ఫిక్సయినట్టు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు భజన బృందానికి తనే గ్యాంగ్ లీడరవ్వాలని రాస్కో సాంబా అంటూ మీడియా ముందు రెచ్చిపోతున్నారు. టిడిపి ఎమ్మెల్యే జలీల్ ఖాన్ సెన్సేషన్ కోసం దేనికైనా రెడీ అంటున్నారు. చంద్రబాబు భజనలో భాగంగా బాబుకి వచ్చే ఐడియాలు ఇంకెవరికీ రావని సర్టిఫికేట్ ఇచ్చేశారు. అడవిలో అసెంబ్లీ నిర్మించిన ఘనత బాబుదేనని తీర్మానించారు. చంద్రబాబు ముందు ప్రధాని మోడీ కూడా దిగదుడుపేనని తేల్చేశారు. అసలు రాష్ట్రంలో బీజేపీతో ఉండాల్సిన అవసరమే లేదన్నారు.
ఇక తన గొప్పదనం గురించి కూడా చెప్పుకున్నారు జలీల్ ఖాన్. ఎన్నికలంటే తనకు అస్సలు భయమే లేదని….ఎప్పుడు పోటీ చేసినా గెలుస్తానని చెప్పారు. పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసినా నాదే గెలుపని ప్రగల్భాలు పలికేశారు. పవన్ కళ్యాణ్‌పై పది ఓట్ల తేడాతో గెలిచేస్తారట ఈ తీస్ మార్ ఖాన్.
 తన వ్యాఖ్యలపై అందరూ నవ్వుతున్నా డోంట్ కేర్ అంటున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ లాబీల్లో జలీల్‌ఖాన్‌ను వైసీపీ ఎమ్మెల్యే సునీల్‌ సరదాగా బీకాంలో ఫిజిక్స్ అన్నా అని టీజ్ చేశారు. అంతా నవ్వుకుంటున్నా మీడియాలో హైలైట్ అవ్వాలంటే అలాగే చెప్పాలని జలీల్ ఖాన్ తన కామెంట్స్ సమర్థించుకున్నారు.
 వైసీపీ అధినేత జగన్ కూడా జలీల్ ఖాన్ పై సెటైర్లు వేశారు. తన ప్రసంగంపై పదేపదే టీడీపీ నేతలు అభ్యంతరం చెబుతుండటంతో విసిగిన జగన్.. బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్లకు తన లెక్కలు అర్థం కావన్నారు.
 మొత్తానికి ఒకేఒక్క స్టేట్ మెంట్ తో ఓవర్ నైట్ పాపులరైన జలీల్ ఖాన్, ఏవరేమనుకున్నా నేనింతే అన్నట్టుగా దూసుకుపోతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here