వైసిపి అధినేత ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ గురువారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మీద విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పుడో వచ్చేదని కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైఖరి వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా అనే అంశాన్ని పక్కన పెట్టేసింది అని చంద్రబాబునాయుడు పై జగన్  ధ్వజమెత్తారు. 
ఈ క్రమంలో వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చంద్రబాబునాయుడు కొనుగోలు చేశారని జగన్ మండిపడ్డారు. అయిన వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యేలను సంతలో పశువుల మాదిరి రూ.20 కోట్లు, రూ.30 కోట్లకు కొనుగోలు చేయడమే కాక, నిబంధనలను తుంగలో తొక్కి మంత్రుల్ని చేస్తారా? వారిపై అనర్హత వేటు పడకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తారా? మీకు దమ్ము, ధైర్యం ఉంటే వాళ్లను అనర్హులుగా ప్రకటించండి. సత్తా ఉంటే మీ పార్టీ గుర్తుపై పోటీ చేయించి గెలిపించుకోండి. 
ఒక్క హామీ నెరవేర్చని మీకు జనం ఓటు వేస్తారన్న నమ్మకం లేదు. కాబట్టే వారిని ఎన్నికల్లో గెలిపించుకునే సాహసం చేయని అసమర్థ ముఖ్యమంత్రి మీరు’ అంటూ ప్రతిపక్ష నేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని జగన్ అన్నారు.
