పంపింగ్ లో ప్రపంచ రికార్డు.. మేఘా సామర్థ్యానికి నిదర్శనం

తెలంగాణ సీఎం కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్టు కాళేశ్వరం మరో ఘనతను సాధించింది. ప్రపంచంలోనే నీటి పంపింగ్ విషయంలో సరికొత్త రికార్డును నెలకొల్పి తెలంగాణ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింప చేసింది. సీఎం కేసీఆర్ ఆలోచనలకు.. మేఘా సామర్థ్యం తోడవడంతో తెలంగాణ భూములు సస్యశ్యామంగా మారుతున్నాయి.

* చరిత్రలో నిలువనున్న కాళేశ్వరం..
తెలంగాణలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే పెద్దదైన బహుళదశల ఎత్తిపోతల పథకంగా రికార్డు నెలకొల్పింది. మూడేళ్లలోనే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు నీటి పంపింగ్ విషయంలోనే సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. అనతికాలంలోనే నీటి పంపింగ్ లో వందల టీఎంసీ నీటిని ఎత్తిపోస్తుంది.

ఈ పథకంలోని ప్రధానమైన నాలుగు పంపింగ్ కేంద్రాల్లో ఒక్కొక్క కేంద్రం నుంచి వంద టీఎంసీల చొప్పున నీటిని ఎగువకు ఎత్తిపోసింది. లింక్ -1లోని మేడిగడ్డ లక్ష్మీ, అన్నారం సరస్వతి, సుందిళ్ల పార్వతి, లింక్-2లో ప్యాకేజ్-8 భూగర్భ గాయత్రి పంపింగ్ కేంద్రాల నుంచి మొత్తం మీద 100 టిఎంసీల చొప్పున పంపింగ్ ను చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను పూర్తి చేయడమే కాకుండా అనతికాలంలోనే వందల టిఎంసీల నీటిని ఎంఈఐఎల్ పంపింగ్ చేసింది.

* నీటి పంపింగ్ లో సరికొత్త రికార్డు..
కాళేశ్వరం ప్రాజెక్టులో భూ ఊపరితలంపైన అతిపెద్దదైన లక్ష్మీ పంప్ హౌస్ ను 2019 జూలై 6న తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర రావు ప్రారంభించారు. నాటి నుంచి 522 రోజులపాటు పని చేసి 100 టిఎంసీల వరకు నీటిని పంప్ చేసింది. ఇక కీలకమైన ఈ పంప్ హౌస్ తో 3 మిషన్ 1110 గంటలపాటు పని చేసి నీటిని ఎత్తిపోసింది. అత్యల్పంగా 13వ మిషన్ 262 గంటలపాటు పనిచేసింది. కాళేశ్వరంలోని తొలిపంప్ హౌస్ ఇదేకావడం విశేషం. ప్రాణహిత నీటిని గోదావరిలోకి ఎత్తిపోయడం లక్ష్మీ పంప్ హౌస్ నుంచే ప్రారంభమవుతుంది.

లక్ష్మీ పంప్ హౌస్ ను పార్వతి పంప్ హౌస్ కు అనుసంధానం చేసే సరస్వతి పంప్ హౌస్ 363 రోజులపాటు నీటిని ఎత్తిపోసింది. వంద టీఎంసీలను నీటిని ఎగువకు తరలించింది. ఇందులో మొదటి మిషన్ 1347 గంటలపాటు పని చేసింది. అతి తక్కువగా 12వ మిషన్ 195 గంటల పాటు పనిచేసింది. ఇక లింక్-1లో చివరిదైన పార్వతి పంప్ హౌస్ సైతం సత్తా చాటింది. ఏకంగా 504 రోజులపాటు నీటిని పంప్ చేసింది. 100 టీఎంసీల నీటిని ఎత్తిపోసింది. అత్యధికంగా రెండవ మిషన్ 1076 గంటల నీటిని ఎత్తిపోసింది. అత్యల్పంగా 14వ మిషన్ కేవలం 333 గంటల పాటు పని చేసింది.

* భూగర్భంలో అద్భుతం.. గాయత్రి పంప్ హౌస్..
లింక్-2లో భూగర్భ అద్భుతమైన గాయత్రి పంప్ హౌస్ ను 2019 ఆగష్టు 11న ప్రారంభించిన మేఘా అనతికాలంలోనే వంద టిఎంసీలను ఎత్తిపోసింది. గాయత్రి పంప్ హౌస్ నుంచి ప్రాణహిత నీటిని శ్రీపాద సాగర్‌ ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరుకు తరలించారు. ఈ పంప్ హౌస్ లో రెండవ మిషన్ అత్యధికంగా 1703 గంటలపాటు నీటిని పంపింగ్ చేయగా.. మొదటి మిషన్ 1367గంటలపాటు పనిచేసి 111 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసింది. గాయత్రిలోని ఏడో మిషన్లో ఒక్కొక్క మిషన్ నుంచి 3150 క్యుసెక్కుల నీటిని విడుదల చేశాయి.

ప్రపంచంలో ఇంతవరకూ ఎక్కడా చేపట్టనంతటి భారీస్థాయిలో పంపుహౌస్‌లను మేఘా ఈ పథకంలో నిర్మించింది. రోజుకు గరిష్టంగా 3 టిఎంసీల నీటిని ఎత్తిపోసేలా నిర్మించిన ఈ భారీ పథకంలో 20పంపుహౌస్‌ల కింద మొత్తం 104మెషీన్‌లను ఏర్పాటు చేసింది. కాళేశ్వరంలో మొత్తం 22 ఎత్తిపోతల కేంద్రాలు నిర్మించగా అందులో 15 కేంద్రాను మేఘా నిర్మించింది.

* భారీ సబ్ స్టేషన్ నిర్మాణంలోనూ రికార్డు..
మేఘా(ఎంఈఐఎల్‌) కాళేశ్వరంలో భారీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం-ట్రాన్స్‌ మిషన్ల లైన్ల ఏర్పాట్లలో సరికొత్త రికార్డ్‌ ను నెలకొల్పింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మొత్తం 5159 మెగావాట్ల విద్యుత్. ఇంతే పంపింగ్ సామర్థ్యం మిషన్లు అవసరంకాగా అందులో ఎంఈఐఎల్‌ 4439 మెగావాట్ల విద్యుత్ అంటే అంత సామర్థ్య పంపింగ్ తో పాటు విద్యుత్‌ సరఫరా చేసే 6 సబ్‌ స్టేషన్లు.. వాటి లైన్లను సకాలంలో పూర్తి చేసి తన సామర్థ్యాన్ని చాటుకుంది.

కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన పంప్‌లు.. మోటార్లను బీహెచ్‌ఈఎల్‌.. ఆండ్రిజ్‌.. జైమ్‌ లాంటి అంతర్జాతీయ సంస్థలు సమకూర్చాయి. ఇంతవరకూ ప్రపంచంలో ఒక పంపింగ్‌ కేంద్రంలో 17 మెషీన్లు ఏర్పాటు కావడం ఎక్కడా లేదు మేడిగడ్డలోనే మొట్టమొదటిది. లక్ష్మీ.. సరస్వతి.. పార్వతి పంపు హౌస్‌ లో ఒక్కొక్కటీ 40 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 43 మెషీన్లను ఏర్పాటు చేశారు. లింక్‌-1లోని ఈ మూడు పంపుహౌస్‌ల కిందే 1720 మెగావాట్ల విద్యుత్‌ వినియోగించే విధంగా పంపులు మోటార్లు ఏర్పాటయ్యాయి. అన్నారం సరస్వతిలో 12 పంపింగ్‌ యూనిట్‌లు.. సుందిళ్ళ పార్వతి పంపంగ్‌ కేంద్రంలో 14 యూనిట్లు అనతి కాలంలోనే పూర్తయ్యాయి. మొత్తం 43 మిషీన్లు వినియోగంలోకి వచ్చాయి.

* ఒక్కో యూనిట్ సామర్థ్యం 139 మెగావాట్లు..
ప్రధానంగా ప్యాకేజీ 8లోని గాయత్రి భూగర్భ పంపింగ్‌ కేంద్రంలో 7రోజులకి 2 టీఎంసీలు పంపు చేసేలా 7యూనిట్‌లు వినియోగంలోకి వచ్చాయి. ఇందులోని ఒక్కొక్క యూనిట్‌ సామర్ధ్యం 139మెగావాట్లు. ఇంత భారీస్థాయి పంపింగ్‌ కేంద్రం ప్రపంచంలో తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో తప్ప మరెక్కడా లేదు. ఈ కేంద్రంలో 973 మెగావాట్ల విద్యుత్‌ వియోగించేలా పంపిగ్‌ సామర్ధ్యం ఉందంటే ఎంతపెద్దదో అర్ధమవుతోంది.

దీని తర్వాత రంగనాయక సాగర్‌ లోని నాలుగు మెషీన్లను ఒక్కొక్కటి 135మెగావాట్ల సామర్ధ్యంతో ఎంఇఐఎల్‌ ఏర్పాటు చేసింది. అన్నపూర్ణ పంప్‌హౌస్‌లో నాలుగు మెషీన్లు ఒక్కొక్కటి 106 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటయ్యాయి. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు అటూ నీటి పంపింగ్ విషయంలోనూ.. విద్యుత్ సబ్ స్టేషన్-ట్రాన్స్ మిషన్ల ఏర్పాటు విషయంలోనూ సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here