గాలి సంపత్ మూవీ రివ్యూ

గాలి సంపత్ – రాజేంద్ర ప్రసాద్, శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదల అయ్యింది. రాజేంద్ర ప్రసాద్ చాలా రోజుల తరువాత ఒక ప్రధాన పాత్రలో నటించడం, శ్రీ విష్ణు వరుసగా కంటెంట్ ఉన్న సినిమాలతో రావడం, అనిల్ రావిపూడి మాటలు, స్క్రీన్ప్లే అందించడం వంటి కారణాల వల్ల ఈ సినిమా పట్ల భారీ హైప్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుందో లేదో చూద్దాం!

కథ-కథనం:
ఈ సినిమాకి కథే హీరో అనడంలో అతిశయోక్తి లేదు. సినిమా కథ అరకులో జరుగుతుంది. గాలి సంపత్ (రాజేంద్ర ప్రసాద్) అనే వ్యక్తి ఒక మూగవాడు, కానీ నటన అంటే చాలా ఇష్టం. నాటకాలు వేయాలని ఒక నాటక మండలి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఇక అతని కొడుకు సూరి (శ్రీ విష్ణు) ఒక ట్రక్ డ్రైవర్. ఎప్పటికైనా ఒక సొంత ట్రక్ కొనుక్కుని తన కాళ్ళ మీద తాను నిలబడాలని అనుకుంటాడు. కానీ గాలి సంపత్ చేసే చిలిపి అమాయకపు చేష్టలు సూరి ని ఇరకాటంలో పడేస్తుంటాయి. ఇక చాలా కష్టాలు పది ట్రక్ కొనడానికి సూరి సంపాదించుకున్న 5 లక్షలను రాజేంద్ర ప్రసాద్ నాటక మండలిలో కట్టేస్తాడు. ఈ సందర్భంలో సూరి తన తండ్రిని తిట్టి ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. ఇక ఆ తరువాత సంపత్ ఒక ప్రమాదంలో పడతాడు. ఆ ప్రమాదం నుండి అతను ఎలా బయటపడతాడు, ఒక మూగవాడిగా అతను అసలు ఆ సమస్యను ఎలా ఎదుర్కొంటాడు అనేదే ఈ సినిమా కథ!

ఇక కథనం విషయానికి వస్తే, సినిమాలో ఒక్క సీన్ కూడా అనవసరం అనిపించదు. ప్రథమార్థంలోని సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తాయి. శ్రీ విష్ణు – లవ్లీ సింగ్ ల లవ్ ట్రాక్ కూడా చక్కటి వినోదాన్ని పంచుతుంది. ఇక ఇంటర్వెల్ కు ముందు రాజేంద్ర ప్రసాద్ తన నట విశ్వరూపం చూపించి ప్రేక్షాకుల చేత కంట తడి పెట్టించాడు.సెకండ్ హాఫ్ లో అసలైన డ్రామా మొదలవుతుంది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగే సన్నివేశాలతో గాలి సంపత్ ద్వితీయార్థం ఆకట్టుకుంది.

నటీనటుల ప్రతిభ:
రాజేంద్ర ప్రసాద్ 43 ఏళ్ళ సుదీర్ఘ కెరీర్ లో గాలి సంపత్ అయన వేసిన అత్యుత్తమ పాత్ర అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ వయసులో అలంటి పాత్ర ను ఎంచుకోవడమే కాకుండా, ఎంతో పట్టుదలతో నటించి మెప్పించారు. ఒక మూగవాని పాత్ర వేయడమే కష్టం అటువంటిది ఆ మూగవాడు అనుకోని ప్రమాదంలో పడితే ఎలా రియాక్ట్ అవుతాడు, ఎలా ఆలోచిస్తాడు, అని పర్ఫెక్ట్ గా నటించారు. సినిమా మొదటి భాగంలో సత్య రాజేంద్ర ప్రసాద్ పాత్రకు డబ్బింగ్ చెప్తాడు కాబట్టి ఒకింత అది సులువే. కానీ రెండవ భాగంలో అటువంటి సహాయం ఏమి లేకుండా ప్రేక్షకులకు అర్థమయ్యేలా రకరకాల ఎమోషన్స్ ను పండించాలంటే రాజేంద్ర ప్రసాద్ వంటి ఉత్తమ నటుడికి మాత్రమే సాధ్యం. సినిమా చూస్తున్నంత సేపు గాలి సంపత్ అనే పాత్ర మన కళ్ళ ముందే ఉంది అనే తీరులో అద్భుతమైన నటన ప్రదర్శించిన రాజేంద్ర ప్రసాద్ గారికి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కాల్సిందే.

ఇక శ్రీ విష్ణు ఎంత గొప్ప మనసు గల నటుడో చెప్పడానికి ఈ సినిమా చాలు.కెరీర్ అనుకున్నట్టుగా సాగుతున్న తరుణంలో ఎవరన్నా మాస్ సినిమాలు చేయాలనుకుంటారు. కానీ శ్రీ విష్ణు కేవలం ఒక మంచి సినిమాలో ఒక మంచి పాత్రలో నటించాలని ఈ సినిమా ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. నటన పరంగా శ్రీ విష్ణు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ముఖ్యంగా రాజేంద్ర ప్రసాద్ తో వచ్చే సన్నివేశాల్లో శ్రీ విష్ణు పోటా పోటీగా నటించాడు. ఎమోషనల్ సీన్స్ లో ఈ తరంలో నటుల్లో అదరహో అనేలా నటించేవారిలో శ్రీ విష్ణు కూడా ఒకడు అని మరోసారి ఈ సినిమాతో నిరూపించాడు.

ఇక సినిమాలో మరో ప్రధాన పాత్ర పోషించిన లవ్లీ సింగ్, ఇది తన మొదటి సినిమా అయినప్పటికీ మంచి నటనతో అక్కట్టుకుంది. ఒక గ్రామీణ యువతిగా తన పాత్రలో ఒదిగిపోయింది. సినిమాలో గాలి సంపత్ కు ట్రాన్స్లేటర్ గా నటించిన సత్య తన కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. తనకు మంచి పాత్రలు పడితే ఎలా రాణిస్తాడో సత్య మరోసారి నిరూపించాడు. రఘు బాబు, మిర్చి కిరణ్, కరాటే కళ్యాణి, తదితరులు తమ పాత్రల పరిధి మేరకు బానే నటించారు.

సాంకేతిక నిపుణులు:
ఈ సినిమాకు కథను అందించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించిన ఎస్. కృష్ణ ఒక గొప్ప కథను మనకు అందించారు. ఇక ఆ కథకు మాటలు స్క్రీన్ప్లే అందించిన అనిల్ రావిపూడిని ఎంత మెచ్చుకున్నా తక్కువ. ఆయన ఒక కమర్షియల్ సినిమా డైరెక్టర్ అయినప్పటికీ ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాకు దర్శకత్వ పర్యవేక్షణ చేసి తన సపోర్ట్ ను అందించడం అభినందనీయం. ఇలా ఇతర దర్శకులు కూడా చేస్తే తెలుగు సినిమా లో కమర్షియల్ సినిమాలు, కంటెంట్ ఆధారంగా వస్తున్నా కొత్త రకమైన సినిమాలు కలిసి బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అవ్వొచ్చు.

సినిమాలో కథానుసారంగా రెండే పాటలు ఉన్నాయి. అచ్చు రాజమణి ఆ పాటలను వినసొంపుగా కంపోజ్ చేయడంతో పాటు తన రీ-రికార్డింగ్ తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. ముఖ్యంగా సినిమా రెండవ భాగంలో రాజేంద్ర ప్రసాద్ నటనకు అనుగుణంగా బాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. సినిమా నిడివి తక్కువగా ఉండేలా చూస్తూ అద్భుతంగా ఎడిటింగ్ చేసారు తమ్మిరాజు. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా అధితమైన ప్రతిభ కనబరిచింది. ఇక ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన అనీష్ కృష్ణ, సినిమాలో అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్తపడ్డాడు.

చివరగా…
ఫామిలీ తో కలిసి థియేటర్లలో చూసే సినిమాలు అరుదుగా వస్తున్న ఈ తరుణంలో గాలి సంపత్ ఒక మంచి ఫామిలీ డ్రామా. కామెడీ, రొమాన్స్, సస్పెన్స్, ఎమోషన్స్ వంటి అన్ని అంశాలు ఉన్న ఈ సినిమాలో మంచి కథా, కథనంతో పాటు మంచి ప్రదర్శనలు కూడా ఉన్నాయి. రాజేంద్ర ప్రసాద్ చేసినా నటనను ఎంత మెచ్చుకున్నా తక్కువే. చివరగా, గాలి సంపత్ వంటి మంచి కథ ఉన్న సినిమాలు రావడం మన అదృష్టం, వాటిని థియేటర్లలో చూసి ఆదరించడం మన బాధ్యత!

Rating:3.0/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here