ర‌జినీకాంత్ రాజ‌కీయ పార్టీ పెడుతుంటే.. ఆ మంత్రి ప‌రోక్షంగా ఏమన్నారో తెలుసా..

త‌మిళ‌నాడులో ర‌జినీకాంత్ రాజ‌కీయ పార్టీపై క్లారిటీ వ‌చ్చేసింది. దీంతో ఇత‌ర రాజ‌కీయ పార్టీల నాయ‌కులు ఇప్పుడు ర‌జినీకాంత్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఎవ‌రెన్ని పార్టీలు పెట్టినా ప్ర‌యోజ‌నం లేద‌న్న‌ట్లు వారు మాట్లాడుతున్నారు. దీంతో ఇప్ప‌టి నుంచే ర‌జినీ రాజీకీయ విమ‌ర్శ‌లు ఎదుర్కొన‌క త‌ప్ప‌డం లేదు.

రాష్ట్రంలో రాజకీయాల్లోకి వస్తున్న సినీ హీరోలకు ప్రజలు మద్దతివ్వరని, ఇప్పటిదాకా ప్రజల సంక్షేమం గురించి ఏ మాత్రం పట్టించుకోని సినీ తారలను వారెలా ఆదరిస్తారని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం పేర్కొన్నారు. విల్లుపురంలో సోమ వారం జరిగిన అన్నాడీఎంకే మహిళా విభాగం, యువజన విభాగం, ఐటీ విభాగం నిర్వాహకుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ పురట్చితలైవర్‌ ఎంజీఆర్‌ ప్రారంభించిన అన్నాడీఎంకే ఐదు దశాబ్దాలుగా ఎన్నో ఆటుపోట్లను, అడ్డంకులను ఎదుర్కొని కంచుకోటలా సుస్థిరంగా కొనసాగుతోందన్నారు. 2016లో రెండోసారి అన్నాడీఎంకే అధికారంలోకి రావడానికి మహిళలే ప్రధాన కారణమని, మహిళలంతా ఓటేసి పార్టీలను గెలిపించారని చెప్పారు.

వచ్చే యేడాది ఫిబ్రవరి లేదా మార్చి నెలారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, ఆ లోపున పార్టీలోని వివిధ విభాగాలకు చెందిన నాయకులంతా కార్యకర్తలతో కలిసి అన్నాడీఎంకే ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రజాసంక్షేమ పథకాలను గురించి ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే గెలిచి వరుసగా మూడుసార్లు అధికారం చేపట్టిన పార్టీగా రాష్ట్ర రాజకీయ చరిత్రలో కొత్త రికార్డును నెలకొల్పబోతున్నదని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించినంతవరకూ నటీనటులకు ప్రజలు మద్దతు ఇవ్వరని, ప్రజల సంక్షేమం పట్టించుకోని తారలకు ఎలా ఓటేస్తారని ఆయన అన్నారు. పురట్చితలైవర్‌ ఎంజీఆర్‌ మినహా తక్కిన సినీ హీరోలను రాష్ట్ర ప్రజలు ఆదరించడం లేదని పాత చరిత్రను పరిశీలిస్తే అవగతమవుతుందని మంత్రి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సినీ హీరోల పార్టీలు గెలిచే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here