ఎమ్మెల్యే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న హిజ్రా.

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌లు వాడీవేడీగా సాగుతున్నాయి. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు క‌లిసి ఉన్న పార్టీలు ఇప్పుడు శత్రువులుగా మారిపోతున్నాయి. దీంతో ఎన్నిక‌ల్లో ఏం జ‌రుగుతుందో అన్న టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. తాజాగా బీహార్ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా హిజ్రాను పోటీకి దింపారు.

లోక్ జ‌న‌శ‌క్తి పార్టీ ( ఎల్‌.జే.పీ) త‌రుపున ఎమ్మెల్యే అభ్యర్థిగా హిజ్రాను పోటీలో నిల‌బెడుతున్నారు. ఆ పార్టీ అభ్య‌ర్థిగా హిజ్రాను ప్ర‌క‌టించ‌డంతో అంద‌రూ షాక్ అయ్యారు. హ‌థువా అసెంబ్లీ స్థానానికి రామ్ ప్ర‌సాద్ ఉర‌ఫ్ మున్నా అనే హిజ్రాకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అవ‌కాశం క‌ల్పించారు. మున్నా దీనికి సంబంధించిన నామినేష‌న్ కూడా వేశారు. మున్నా ఇప్ప‌టికే కౌన్సిల‌ర్‌గా కొన‌స‌గుతున్నారు. మున్నా కొన్నేళ్ల నుంచి రాజ‌కీయాల్లో ఉంటున్నారు.

అంత‌కుముందు జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కూడా మున్నా పోటీ చేశారు. అయితే ఓట‌మి పాల‌య్యారు. ఆ త‌ర్వాత 2012లో ఫులవరియా, 2015లో హథువాలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా పోటీ చేయ‌నున్నారు. ఎల్జేపీ మున్నాకు సీటివ్వ‌డంతో అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. దీంతో ఎల్జేపీ న‌డిచిన బాట‌లోనే ఇత‌ర పార్టీలు కూడా ముందుకు వెళ‌తాయ‌ని చెప్పొచ్చు. దీని ద్వారా ఇత‌ర పార్టీల నుంచి కూడా హిజ్రాలు పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

కాగా ఎల్జేపీ మొద‌ట ద‌శ ఎన్నిక‌ల అభ్య‌ర్థుల జాబితాలో 95 మంది, రెండ‌వ ద‌శ ఎన్నిక‌ల‌కు సంబంధించి 53 మంది అభ్య‌ర్థుల పేర్ల‌ను విడుద‌ల చేసింది. మున్నా గోపాల్‌గంజ్ జిల్లాలోని సెలారక్లా గ్రామనివాసి. ఇక బీహార్ ఎన్నిక‌ల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీతో ఎలాంటి పొత్తులూ లేవని బీజేపీ ప్ర‌క‌టించింది. దీంతో ఈ ఎన్నిక‌ల్లో ఎల్జేపీ ఒంట‌రిగానే పోటీ చేయ‌నుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here