షాకింగ్: అభిమాని కాళ్లు మొక్కిన సూర్య

అభిమాన కథానాయకుల కాళ్లను ఫ్యాన్స్ మొక్కడం మామూలే. ఈ మధ్య సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులతో సమావేశం నిర్వహిస్తే కొందరు దేవుడి చుట్టూ తిరిగినట్లు కొందరు ఆయన చుట్టూ తిరిగారు. ఆయన ముందు గుంజీళ్లు కూడా తీశారు. ఐతే ఇలాంటి పరిణామాల మధ్య ఒక అభిమాని కాళ్లను ఒక స్టార్ హీరో మొక్కడం అరుదైన విషయమే. తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకడైన సూర్య ఇదే పని చేశాడు. తన కొత్త సినిమా ‘తానా సేంద కూట్టం’ ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ఒక ఈవెంట్లో అతను ఒకరికిద్దరు అభిమానులకు పాదాభివందనం చేశాడు.

అతను వేదిక మీద మాట్లాడుతుండగా కొందరు అభిమానులు పైకి వచ్చే ప్రయత్నం చేశారు. సూర్య సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుంటుండగా.. సూర్య వారిని వారించాడు. అభిమానుల్ని పైకి పిలిపించాడు. పైకి రాగానే అభిమానులు వరుసబెట్టి సూర్యకు పాదాభివందనం చేయడం మొదలు పెట్టారు. ఐతే ఆశ్చర్యకరంగా సూర్య వెంటనే తిరిగి ఒక్కొక్కరి కాళ్లు మొక్కడంతో అందరూ అవాక్కయ్యారు. ఇలాంటి వందనాలు వద్దని పరోక్షంగా ఇలా చాటి చెప్పాడన్నమాట సూర్య.

తన కంటే చిన్న వాళ్లయిన కుర్రాళ్లకు సూర్య ఇలా పాదాభివందనం చేయడం అనూహ్యమే. మామూలుగానే సూర్య వెర్రి అభిమానాన్ని ప్రోత్సహించడు. తాజా చర్య అతడి ఉద్దేశాన్ని మరోసారి చాటి చెప్పింది. ఈ తతంగం అయ్యాక సూర్య ఆ అభిమానులతో కలిసి ఈ సినిమాలోని ఒక పాటకు డ్యాన్స్ చేయడం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here