దేశంలో బీజేపీ పాగా వేయాలని చూస్తోంది. ఇప్పటికే కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ.. ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో కూడా అధికారం చేపట్టాలని గట్టిగా నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇటీవల రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పుడు ప్రధానంగా పశ్చిమబెంగాల్‌పై బీజేపీ దృష్టి పెట్టింది.
పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు త్వరలోనే రానున్నాయి. దీంతో బీజేపీ ఇప్పటి నుంచే బెంగాల్లో రాజకీయాలు వేడిక్కిస్తోంది. అమిత్‌షా ఈ ఎన్నికలపై కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల తృణముల్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత అయిన సువెందు అధికారిని బీజేపీలోకి రప్పించారు. ఈయన పార్టీని వీడి రావడంతో టీఎంసీ విజయంపై ప్రభావం చూపుతుందని అంతా అనుకుంటున్నారు. ఇన్నాళ్లూ పార్టీలో కీ రోల్లో ఉన్న వ్యక్తి సుబేందు. కేవలం వారసత్వ రాజకీయాల వల్ల ఆయన పార్టీని వీడాల్సి వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమబెంగాల్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కమలం వికసించిన తర్వాతే నిద్రపోతానని సువేందు అధికారి చెప్పారు. కాంటాయ్ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో అధికారి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘గోపిబల్లబ్ పూర్ లో దిలీప్ ఘోష్, కాంతీలో సువేందు అధికారి కలిసి వచ్చారు…టీఎంసీకి ఇక ఓటమి తప్పదు, కమలం వికసించేదాకా నేను నిద్రపోను’’అని సువేందు అధికారి చెప్పారు. బహిరంగ సభకు ఒకరోజు ముందు మచేదా బైపాస్ రోడ్డు నుంచి సెంట్రల్ బస్ స్టాండు వరకు సువేందు అధికారి రోడ్ షో చేశారు. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు టీఎంసీ సర్కారు విసిరికొట్టేలా సునామీ వస్తుందని సువేందు అధికారి జోస్యం చెప్పారు.