గోవింద నామాలు పెట్టుకొని ఆల‌యంలోకి వెళ్ల‌టమే డిక్ల‌రేష‌న‌ట‌..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తిరుమ‌ల డిక్ల‌రేష‌న్ వివాదం ఇంకా కొన‌సాగుతూనే ఉంది. మొన్న సీఎం ప‌ర్య‌ట‌న విజ‌య‌వంతంగా ముగిసిన విష‌యం తెలిసిందే. అయితే ఇది ఇంత‌టితో అయిపోయిందిలే అనుకుంటే ఇప్పుడు మళ్లీ డిక్ల‌రేష‌న్‌పై ఏపీ మంత్రి కామెంట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఏపీ ఉప‌ముఖ్య‌మంత్రి నారాయ‌ణ స్వామి వ్యాఖ్య‌లు మ‌రోసారి వివాదానికి ఆజ్యం పోసేలా ఉన్నాయి. డిక్ల‌రేష‌న్ వివాదం గురించి అంతా మ‌ర్చిపోయార‌నుకుంటున్న త‌రుణంలో నారాయ‌ణ స్వామి మ‌రోసారి దీనిపై వ్యాఖ్య‌లు చేశారు. వెంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నం కోసం సీఎం జ‌గ‌న్ డిక్ల‌రేష‌న్‌పై సంత‌కం చేయాల్సిన అవ‌స‌రం ఏముంద‌ని ఆయ‌న అన్నారు. నుదుట‌న గోవింద నామాలు పెట్టుకొని ఆల‌యంలోకి జ‌గ‌న్ వెళ్లార‌న్నారు. ఇంత‌కంటే డిక్ల‌రేష‌న్ ఏముంటుంద‌ని ఆయ‌న అన్నారు.

ప్రతిప‌క్షాలు ప్ర‌భుత్వంపై అన‌వ‌స‌ర రాద్దాంతం చేస్తున్నాయ‌న్నారు. జ‌గ‌న్ ప్ర‌జ‌లు మెచ్చిన సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నార‌ని.. దీంతో ఏం చేయాలో తోచ‌క గుళ్లు, గోపురాల మీద ప్ర‌తిప‌క్ష నాయ‌కులు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని తెలిపారు. కాగా మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌పై మ‌రోసారి వివాదం త‌లెత్తే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. కాగా ఇటీవ‌ల డిక్ల‌రేషన్ అంశంతో పాటు ఆల‌యాలపై దాడుల  అంశం ఏపీ రాజ‌కీయాల్లో మాటల దాడుల వ‌ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here