మ‌ణిపూర్ ముఖ్య‌మంత్రికి క‌రోనా.. అనారోగ్యంపాలైన‌ హ‌ర్యానా ముఖ్య‌మంత్రి..

దేశంలో ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు అనారోగ్యం బారిన ప‌డుతున్నారు. మ‌ణిపూర్ ముఖ్య‌మంత్రి ఎన్‌. బీరేన్ సింగ్‌కు క‌రోనా సోకింది. ఈ విష‌యాన్ని ఆయ‌న ఓ ట్వీట్‌లో వెల్ల‌డించారు. క‌రోనా ప‌రీక్ష‌ల్లో త‌న‌కు పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యిన‌ట్లు చెప్పారు. దీంతో ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారు కూడా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని కోరారు. క‌రోనా నిర్దార‌ణ అయిన త‌ర్వాత సీఎం హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు.

దేశవ్యాప్తంగా 88 లక్షలకు పైగా కోవిడ్ కేసులు నమోదు కాగా, ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎంలు కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కర్ణాటక సీఎం బీఎస్ యడియూరప్ప, నితిన్ గడ్కరి, గజేంద్ర సింగ్ షెకావత్, శ్రీపాద్ నాయక్, కైలాష్ చౌదరి, అర్జున్ రామ్ మేఘ్వాల్, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు కోవిడ్ పాజిటివ్ బారిన పడి, చికిత్సానందరం కోలుకున్నారు.

ఇదిలా ఉంటే నిన్న హిమాచల్‌ప్రదేశ్ పర్యటనలో ఉన్న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ శ్వాసకోశ సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరారు. శ్వాస తీసుకోవడంలో తనకు ఇబ్బందిగా ఉందని చెప్పడంతో వెంటనే ఆయనను ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (ఐజీఎంసీ)కి తరలించారు. వైద్యులు అక్కడాయనకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని ఆసుపత్రి నుంచి బయటకు వస్తూ ముఖ్యమంత్రి చెప్పారు. శ్వాసకోశ సమస్యపై ప్రశ్నించగా, ప్రస్తుతం తనకు ఎటువంటి సమస్యలు లేవని, అంతా బాగానే ఉందని పేర్కొన్నారు. రాత్రి సరైన నిద్ర లేకపోవడం వల్ల ఆయన కొంత అస్వస్థతకు గురైనట్టు ఐజీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ రజనీశ్ పఠానియా తెలిపారు. ఆయనకు నిర్వహించిన బ్లడ్, ఎకో, ఎక్స్-రే తదితర రిపోర్టులన్నీ బాగానే ఉన్నాయని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here