విజయశాంతిని చూస్తే కడుపు రగిలిపోతుంది.

తెలంగాణా కోసం కొట్లాడినా, తెలంగాణా ఇచ్చిన ఘనతను మూటకట్టుకున్నా.. గాంధీ భవన్‌నే నమ్ముకున్నా.. పదవులురావడం లేదు. నిన్నకాక మొన్న వచ్చిన రేవంత్‌కి, మెదక్‌లో ఓడిపోయి.. పార్టీ దిక్కు కూడా చూడని రాములమ్మకి పెద్దపీటలు వేయడం చూస్తుంటే తెలంగాణా కాంగ్రెస్‌ నేతలకు కడుపు రగిలిపోతోంది. రేవంత్‌ ఓకే అనుకున్నా.. విజయశాంతి విషయం మాత్రం వారికి ఏ మాత్రం మింగుడు పడడం లేదు.
రేవంత్‌ అంటే సరే మాస్‌లో ఫాలోయింగ్‌ ఉంది. పెద్దపీట వేస్తున్నారంటే.. పార్టీకే మంచిది కదా అని తెలంగాణా కాంగ్రెస్‌ వాదులు సరిపెట్టుకున్నారు. అదే కాకుండా ఇప్పుడు తగుదునమ్మా అని రాములమ్మ కూడా రాహుల్‌తో భేటీ కావడం వీరికి అసలు జీర్ణం కావడం లేదు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో మెదక్‌లో పోటీ చేసి.. ఓడిపోయాక, గాంధీభవన్‌ వైపు ఒక్కసారిగా కూడా కన్నెత్తి చూడని విజయశాంతికి మళ్లీ కాంగ్రెస్‌ పెద్దలు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆ పార్టీ సీనియర్లే నిలదీస్తున్నారట.
ఇక విజయశాంతి ఏకంగా ఏఐసీసీలోనే పోస్టు ఇస్తారనే వార్తలపై తెలంగాణా కాంగ్రెస్‌ వాదులు మండిపడుతున్నారు. రాములమ్మకి ఏఐసీసీ కార్యదర్శి, ఎన్నికల ప్రచార కమిటీలో స్థానం ఇస్తారనే వార్తలపై గాంధీ భవన్‌నే నమ్ముకున్న కాంగ్రెస్‌ వాదులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. మెదక్‌లో ఓడిపోవడమే కాకుండా, ఓటమి అక్కడి మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డే కారణమని అధిష్టానానికి ఫిర్యాదు చేసిన విజయశాంతిని రాహుల్‌ వద్దకు తీసుకెళ్లడంలో ఉత్తమ్‌, కుంతియా వంటి అగ్ర నేతల హస్తముందని విమర్శిస్తున్నారు. సినిమా వాళ్లు ప్రచారం చేస్తే పార్టీ అధికారంలోకి రాదన్న నిజాన్ని కాంగ్రెస్‌ పెద్దలు తెలుసుకోవాలని వాపోతున్నారు.
రాములమ్మను రాహుల్‌ వద్దకు తీసుకెళ్లిన ఉత్తమ్‌, కుంతియాపై జానారెడ్డి కూడా మండిపడినట్లు తెలుస్తోంది. శుక్రవారం నాటి అసెంబ్లీ వాయిదా తరువాత జానా ఛాంబర్లో ఇతర నేతలతో కలిసి భేటీ అయిన ఉత్తమ్‌.. ఇచ్చిన వివరణ సంతృప్తి నివ్వలేదని సమాచారం. కుంతియా అండ చూసుకొనే ఉత్తమ్‌ ఒంటెత్తు పోకడలు పోతున్నారని, దీనికి రాములమ్మ ఉదంతమే నిదర్శనమని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here