ఢిల్లీకి వెళ్లి ధ‌ర్నా చేస్తున్న ముఖ్య‌మంత్రి..

దేశ రాజ‌ధానిలో ఓ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ధ‌ర్నా చేస్తున్నారు. పంజాబ్‌‌కు గూడ్స్ రైళ్లను నిలిపేయడాన్ని నిరసిస్తూ పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ అంతటా రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కొన్ని రోజులుగా రైల్ రోకో, ధర్నాలకు దిగుతున్నారు. దీంతో రైల్వే ఆస్తులకు, యాజమాన్యానికి నష్టాలు కలుగుతోంది.

ఈ పరిణామాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర రైల్వే శాఖ… పంజాబ్ ప్రాంతానికి గూడ్స్ రైళ్లను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించుకుంది. దీన్ని వ్య‌తిరేకిస్తూ సీఎం ధ‌ర్నా చేస్తున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఈ ధర్నాలో పాల్గొన్నారు. తమ రాష్ట్రానికి గూడ్స్ రైళ్లను రద్దు చేసి, మోదీ ప్రభుత్వం తమ గొంతు నులిమేస్తోందని ఎమ్మెల్యేలు తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు కూడా తీవ్రమయ్యాయని, రాష్ట్రానికి అవసరమైన 14.50 లక్షల టన్నుల యూరియాను ట్రక్కుల్లో తెచ్చుకుంటున్నామని ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా… కేంద్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.

పంజాబ్ పరిస్థితిని రాష్ట్రపతికి నివేదిద్దామని ప్రయత్నిస్తే రాష్ట్రపతి కోవింద్ తమకు సమయం కేటాయించలేదని సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. దీంతో ఢిల్లీకి వచ్చి… తమ నిరసనను తెలుపుదామని నిర్ణయించుకుమన్నామని ఆయన చెప్పారు. ఈ విషయంపై ఇప్పటి వరకైతే ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ అడగలేదని, అదే ప్రయత్నంలో ఉన్నామని పేర్కొన్నారు. తమ దగ్గర ఉన్న కొద్దిపాటి నిధులతో తాము కేంద్రం నుంచి విద్యుత్తును కొనుగోలు చేస్తున్నామని, తమకు రావాల్సిన జీఎస్టీ నిధులు ఇప్పటికీ రాలేదని మండిపడ్డారు. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ రాజ‌ధానిలో ధ‌ర్నా చేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here