చంద్ర‌బాబు రంగంలోకి దిగాడు..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో రోజుకో అంశం తెర‌మీద‌కు వ‌స్తోంది. తాజాగా గీతం విశ్వ‌విద్యాలయం వ‌ద్ద అక్ర‌మ క‌ట్ట‌డాలు కూల్చివేయ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. దీనిపై తెలుగుదేశం పార్టీ ఉవ్వెత్తున ఎగిసిప‌డుతోంది. తాజాగా ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు స్పందించారు.

ఉద‌యం గీతం యూనివ‌ర్శిటీ వ‌ద్ద అధికారులు అక్ర‌మ క‌ట్ట‌డాలంటూ ప‌లు క‌ట్ట‌డాలు కూల్చివేసిన విష‌యం తెలిసిందే. పోలీసుల‌ను భారీగా మొహ‌రించి జీవీఎంసీ అధికారులు ప‌ని కానిచ్చేశారు. అయితే విష‌యం బ‌య‌ట‌కు తెలియ‌డంతో అక్క‌డికి టిడిపి శ్రేణులు చేరుకున్నారు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టిడిపి దీనిపై మండిప‌డుతోంది. కేవ‌లం వైఎస్ జ‌గ‌న్ కూల్చ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నారని టిడిపి నేత‌లు అంటున్నారు. కోర్టులో ఉన్న వివాదంపై, ఎటువంటి ఆదేశాలు రాకముందే యూనివర్సిటీ కట్టడాలను కూల్చేయడం వైసీపీ కక్ష సాధింపు చర్య అని చంద్రబాబు నాయుడు అన్నారు. వ్యక్తులపై, పార్టీపై అక్కసుతో రాజకీయ కక్ష సాధింపు చర్యలను గర్హిస్తున్నామ‌న్నారు.

కరోనా కాలంలో సామాజిక బాధ్యతగా కోట్ల రూపాయల నష్టాన్ని భరించి 2590 మంది కోవిడ్ పేషంట్లకు చికిత్స అందించిందన్నారు. అలాంటి ఆదర్శవంతమైన సరస్వతీ నిలయాన్ని అర్ధరాత్రి 200 మందితో వెళ్ళి కూల్చడం దారుణని పేర్కొన్నారు. కట్టడం చేతగానివాళ్లకు కూల్చే హక్కులేదని.. ఇప్పటికే చదువు, ఉపాధి, ఆరోగ్య చికిత్సల కోసం ఏపీ ప్రజలు పక్క రాష్ట్రాలకు పోతున్నారన్నారు. ఈ సమయంలో అటు విద్యాసేవ, ఇటు సామాజికసేవల్లో చేయూత అందిస్తూ రాష్ట్రానికి, ముఖ్యంగా ఉత్తరాంధ్రకు గర్వకారణమైన గీతం సంస్థలపై రాజకీయ కక్షసాధింపు మరో తుగ్లక్ చర్య అని చంద్రబాబు తెలిపారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా చంద్ర‌బాబు స్పందించారు. అయితే వైసీపీ నేత‌లు మాత్రం గీతం విశ్వ‌విద్యాల‌యం అక్ర‌మణ‌లో ఉన్న స్థ‌లంపై అధికారులు దాడులు చేస్తున్నార‌ని చెబుతున్నారు. మొత్తానికి గీతం విశ్వ‌విద్యాల‌యం వ‌ద్ద కూల్చివేత‌లు రాజ‌కీయ దుమారం రేపుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here