బీజేపీకి అన్నీ ఉన్నా ఆ ఒక్క‌టీ లేదు..

దేశంలో అన్ని ప్రాంతాల్లో న‌రేంద్ర మోదీ హ‌వా కొన‌సాగినా ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణాలో మాత్రం ప‌రిస్థితి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్క‌డ ప్రాంతీయ పార్టీల హ‌వా కొన‌సాగుతూ ఉంటుంది. అయితే ద‌శాబ్దాలుగా బీజేపీ ఏపీ, తెలంగాణాల‌లో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్నా అది జ‌ర‌గ‌డం లేదు.

2019లో మోదీ భారీ మెజార్టీతో ప్ర‌ధాని పీఠం చేప‌ట్టిన త‌ర్వాత పార్టీ వీక్ ఉన్న ప్రాంతాలపై ఫోక‌స్ పెట్టారు. వీటిలో ప్ర‌ధానంగా తెలుగు రాష్ట్రాలతో పాటు త‌మిళ‌నాడు, కేర‌ళ‌, ఒడిస్సాల‌లో పాగా వేయాల‌ని బీజేపీ చూస్తోంది. ఏ రాజ‌కీయ పార్టీ అయినా ముందుగా ఆయా రాష్ట్రాల‌లో చేయాల్సిన ప‌ని పార్టీ కార్యాల‌యాలు ఏర్పాటు చేసుకోవ‌డం.

ఇక ఏపీ విష‌యానికొస్తే రాష్ట్రంలో బీజేపీకి సొంత రాష్ట్ర కార్యాల‌యం లేదు. ఏపీ రాజ‌కీయ ప‌రిస్థితుల‌పై పార్టీ కీల‌క నాయ‌కుల ప‌ర్య‌వేక్ష‌ణ ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టివ‌ర‌కు సొంతంగా ఆఫీసు ఏర్పాటుచేసుకోలేదు. పైగా పార్టీ కార్యాల‌యం కోసం స్థ‌లం ఇచ్చిన నేత వెల‌గ‌పూడి గోపాల‌కృష్ణ‌ను నాయ‌క‌త్వం సస్పెండ్ చేయ‌డం ఇక్క‌డ ప్ర‌త్యేక‌త సంత‌రించుకుంది.

రాష్ట్రంలో బ‌ల‌ప‌డేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్న బీజేపీ ఇప్ప‌టికే ఈ త‌ర‌హాలో ముందుకు వెళుతోంది. అందుకే ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌న‌సేన పార్టీతో జ‌త క‌లిసింది. తాజాగా ఆ పార్టీ రాష్ట్ర అద్య‌క్షుడి మార్పు కూడా జ‌రిగింది. గ‌తంలో ఎంతో మంది రాష్ట్ర అద్య‌క్ష ప‌ద‌విలో ప‌నిచేసినా పార్టీ కార్యాల‌యం విష‌యంలో అడుగు ముందుకు వెయ్య‌లేద‌ని తెలుస్తోంది. ఇప్పుడు కొత్త అద్య‌క్షుడైనా పార్టీ కార్యాల‌యం విష‌యంలో చొర‌వ తీసుకొని ఆ త‌ర్వాత పార్టీ బ‌లోపేతంపై దృష్టి పెడితే బాగుంటుంద‌ని ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు మాట్లాడుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here