ఏపీకి బ్యాడ్ న్యూస్.. మ‌రో మూడు రోజులు వ‌ర్షాలు..

వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో ఇప్ప‌టికే పూర్తిగా ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మ‌రో చేదు వార్త వినిపిస్తోంది. మ‌రో మూడు రోజుల పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ‌ర్షాలు కురుస్తాయ‌ని అధికారులు చెబుతున్నారు. దీంతో ఈ వార్త విన్న రైతులు, వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

రానున్న మూడు రోజుల్లో ఏపీలో వ‌ర్షాలు కురుస్తాయ‌న్న స‌మాచారాన్ని అమ‌రావ‌తి వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. తమిళనాడు తీరానికి దగ్గరలో, నైరుతి బంగాళాఖాతంలో 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అలాగే, దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఆగ్నేయ, నైరుతి బంగాళాఖాతం ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. వీటి ప్రభావంతో దక్షిణాది రాష్ట్రాలపైకి సముద్రం నుంచి తూర్పుగాలులు వీస్తున్నాయి. రాగల మూడు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

మంగళవారం నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఇతర జిల్లాల్లో అక్కడక్కడ చెదురుమదురుగా వాన జల్లులు పడ్డాయి. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. కావలిలో 35 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కాగా ఇప్ప‌టికే ఏపీలో భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో ప్ర‌జ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోయారు. అన్న‌దాత‌ల పంట‌లు నీట‌మునిగిన విష‌యం తెలిసిందే. దీంతో మ‌రోసారి వ‌ర్షాలు కురుస్తాయ‌న్న వార్త‌ల‌తో అంతా ఆందోళ‌న చెందుతున్నారు. అయితే ప్రాజెక్టులు మాత్రం నీటితో క‌ల‌క‌ల‌లాడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here