బాబ్రీ మసీదును కూల్చివేశా… సోష‌ల్ మీడియాలో ఎంపీ సాధ్వీ ప్రగ్యా సింగ్ ఎన్నిక‌ల నాటి వీడియో..

బాబ్రీ మ‌సీదు కూల్చివేత కేసులో సీబీఐ న్యాయ‌స్థానం అంద‌రినీ నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు ఇచ్చిన నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా అనుకూల‌, వ్య‌తిరేక ధ్వ‌నులు వినిపిస్తున్నాయి. అయితే బీజేపీ నేత, ఎంపీ సాధ్వీ ప్ర‌గ్యా సింగ్ గ‌తంలో చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారుతున్నాయి. నెటిజ‌న్లు ఈ కామెంట్ల‌పైనే ఇప్పుడు ఫోక‌స్ పెట్టారు.

గ‌తేడాది జ‌రిగిన లోక్‌స‌భ ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్న సాధ్వీ ప్ర‌గ్యా సింగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏమన్నారంటే తాను అయోధ్య‌కు వెళ్లి బాబ్రీ మ‌సీదును కూల్చివేసిన‌ట్లు చెప్పారు. ఈ విష‌యాన్ని తాను కాద‌న‌డం లేదు క‌దా అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మ‌ళ్లీ అక్క‌డ‌కు వెళ్లి రామాల‌య నిర్మాణంలో పాల్గొంటా అన్నారు. బాబ్రీ మ‌సీదును కూల్చివేసినందుకు తామెందుకు బాధ‌ప‌డాల‌న్నారు. త‌మ‌కు ఎలాంటి బాధ లేద‌న్నారు. నిజానికి తాము గ‌ర్వ‌ప‌డుతున్నామ‌ని చెప్పారు. రామాల‌యంలో కొన్ని వ్య‌ర్థ‌మైన‌వి ఉన్నాయ‌ని.. తాము వాటిని తొల‌గించామ‌న్నారు. మేము అక్క‌డ శ్రీ‌రాముడికి భ‌వ్య‌మందిరం నిర్మిస్తామ‌ని వ్యాఖ్య‌లు చేశారు.

అయితే ఆ వ్యాఖ్య‌ల‌ను ఇప్పుడు నెటిజ‌న్లు ఫాలో అవుతున్నారు. అప్ప‌ట్లో ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇలా వ్యాఖ్యానించార‌ని.. ఇప్పుడు తీర్పు విష‌యంలో సంబ‌ర ప‌డిపోతున్నార‌ని కామెంట్లు చేస్తున్నారు. మ‌రి ప్ర‌గ్యా వ్యాఖ్య‌లు పెను దుమారం రేపే విదంగా కనిపిస్తున్నాయి. కాగా బాబ్రీ మ‌సీదు కూల్చివేత తీర్పులో 32 మందిని నిర్దోషులుగా ప్ర‌క‌టిస్తూ సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన విష‌యం తెలిసిందే. అంద‌రినీ నిర్దోషులుగా తేల్చితే మ‌సీదును ఎవ‌రు కూల్చార‌ని ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ అన్నారు. అంద‌రూ నిర్దోషులైన‌ప్పుడు మ‌సీదు దానంత‌ట అదే కూలిపోయిందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here