23 ఏళ్ల బంధం తెగింది.. దేశ వ్యాప్తంగా చ‌ర్చ మొద‌లైంది..

2019 ఎన్నిక‌ల్లో భారీ మెజార్టీతో అధికారం చేప‌ట్టింది బీజేపీ. అయితే ఏ పార్టీ స‌పోర్టు లేకుండా ప్ర‌భుత్వాన్ని ఫామ్ చేయ‌గ‌ల స‌త్తా బీజేపికి వ‌చ్చేసింది. అందుకేనేమో ఇప్పుడు ఆ పార్టీ ఇలా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని అంతా అనుకుంటున్నారు.

ఎన్‌డిఏ నుంచి అకాలీద‌ళ్ పార్టీ బ‌య‌ట‌కు రావ‌డం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దాదాపు 23 సంవత్స‌రాలుగా బీజేపీతో క‌లిసి ముందుకు సాగిన అకాలీద‌ళ్ ఇప్పుడు బీజేపీతో బంధం తెంచుకుంది. ఈ మేర‌కు ఆ పార్టీ పెద్ద‌లు నిర్ణ‌యం తీసుకున్నారు. శ‌నివారం జ‌రిగిన స‌మావేశంలో తీసుకున్న ఈ నిర్ణ‌యం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీస్తోంది.

ఎందుకంటే బీజేపీ ఇత‌ర పార్టీల‌తో పొత్తులు పెట్టుకోవ‌డం మామూలు విష‌య‌మే అయినా అది ఎన్నో సార్లు మేలు చేసింది. అలాంటిది ఇప్పుడు కేంద్రంలో భారీ మెజార్టీతో ఉన్నాం క‌దా అని ఇలా మిత్ర‌పక్షాల‌ను ఒక్కొక్క దాన్ని దూరం చేసుకుంటూ పోతే చివ‌రకు ఏం మిగులుతుంద‌ని ఇప్పుడు బీజేపీ పెద్ద‌లు ఆలోచిస్తున్నారంట‌. ఇప్ప‌టికే శివ‌సేన వెళ్ల‌గా.. ఇప్పుడు అకాలీద‌ళ్ వైదొల‌గ‌డంతో భ‌విష్య‌త్ గురించి కూడా ఆలోచించుకోవాల్సిన ప‌రిస్థితి ఎంతో ఉంది.

కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ బిల్లులు ఈ ప‌రిణామాల‌కు దారితీశాయి. ఈ విష‌యంపై ముందు నుంచీ బీజేపికి చెబుతూనే ఉన్నామని అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అన్నారు. వ్యవసాయ బిల్లులను తాము సభలో వ్యతిరేకించామ‌ని.. నేరుగా రైతులకు, రైతు కూలీలకు నష్టం చేస్తాయని మండిప‌డ్డారు. కనీస మద్దతు ధరకు విక్రయించుకునేందుకు చట్టపరమైన రక్షణ కల్పించడానికి కేంద్రం నిరాకరించిందని, జమ్మూలో పంజాబీని రెండో అధికార భాష స్థాయి నుంచి తొలగించడం వంటి చర్యలను నిరసిస్తూ ఎన్డీయే కూటమి నుంచి బయటకి రావాలి నిర్ణయించుకున్నట్లు ఆయన ప్రకటించారు.

అయితే తాము తీసుకుంటున్న నిర్ణ‌యాలు దేశానికి మంచి చేసేవే అని కేంద్ర ప్ర‌భుత్వం చెబుతోంది. మిత్ర‌ప‌క్షాలతో పాటు ప్ర‌తిప‌క్షాలు కూడా దీన్ని తీవ్రంగా వ్య‌తిరేకించాయి. ఈ బిల్లు కార‌ణంగా ఏర్ప‌డిన వివాదం వ‌ల్ల ఎంపీలు కూడా సస్పెండ్‌కు గుర‌య్యారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో అకాలీద‌ళ్ తీసుకున్న నిర్ణ‌యంపై రైతుల్లో మంచి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ఆపార్టీ భావిస్తోంది. ఇదే స‌మ‌యంలో బీజేపీ వ్య‌వ‌హిస్తున్న తీరు ప‌ట్ల ఆందోళ‌న నెల‌కొంది. పార్టీ నుంచి మిత్ర ప‌క్షాలు బ‌య‌ట‌కు వెళ్ల‌డం ఎప్ప‌టికీ మంచిది కాద‌ని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here