సీఎం కేసీఆర్: అమర జవాను కుటుంబానికి భారీ సహాయం

సరిహద్దులో జరిగిన ఘర్షణల్లో అమరుడైన కల్నల్ సంతోశ్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం భారీ సహాయం ప్రకటించింది. ఆ కుటుంబానికి పూర్తి అండగా ఉంటామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఈ సందర్భంగా అతడి కుటుంబానికి రూ.5 కోట్ల సాయం చేస్తామని శుక్రవారం తెలిపారు. తానే స్వయంగా సూర్యాపేటలోని సంతోశ్ బాబు ఇంటికెళ్లి సాయం అందిస్తానని వెల్లడించారు. ఆర్థిక సహాయంతో పాటు కల్నల్ కుటుంబానికి ఇంటి స్థలం ఆయన భార్య సంతోషికి గ్రూప్-1 ఉద్యోగం ఇస్తామని భరోసా ఇచ్చారు.

కల్నల్ సంతోశ్ బాబుతో పాటు గాల్వన్ లోయలో చైనా సైనికులతో పోరాడుతూ అమరులైన మరో 19 మంది సైనికులకు కూడా తెలంగాణ ప్రభుత్వం సహాయం ప్రకటించింది. ఒక్కో అమర జవాన్ కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున సాయం చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సైనికుల సేవలను స్మరించుకున్నారు.

సరిహద్దుల్లో దేశానికి రక్షణగా నిలుస్తున్న సైనికులకు యావత్ దేశం అండగా నిలవాలని సీఎం కేసీఆర్ కోరారు. వీర మరణం పొందిన సైనికుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ప్రజలు అండగా ఉంటే సైనికుల్లో ఆత్మ విశ్వాసం వారి కుటుంబాల్లో భరోసా నిండుతుందని పేర్కొన్నారు.

దేశమంతా మీ వెంటే ఉందనే సందేశం పంపాలని సూచించారు. వీర మరణం పొందిన సైనికులకు కేంద్ర ప్రభుత్వం అందించే సహాయంతో పాటు రాష్ట్రాలు కూడా సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. వైరస్తో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మిగతా ఖర్చులు తగ్గించుకుని అయినా సైనికుల సంక్షేమానికి పాటు పడాలని సీఎం కేసీఆర్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here