నారా లోకేష్ కు ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధమైందా?

టీడీపీ అధినేత చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ మెడకు ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధమైందా? త్వరలోనే లోకేష్ ను మూసేసే ప్లాన్ చేసిందా అంటే ఔననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు.. తాజాగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే అలానే అనిపిస్తోందని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసి షాక్ ఇచ్చిన జగన్ ప్రభుత్వం తాజాగా లోకేష్ ను టార్గెట్ చేసినట్టు ప్రచారం సాగుతోంది.

టీడీపీ సర్కార్ హయాంలో ముఖ్యంగా నారా లోకేష్ ఐటీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో చేపట్టిన అతిపెద్ద పథకం ఫైబర్ గ్రిడ్. ఈ పథకంలో వందల కోట్ల అవినీతి జరిగినట్టు తాజాగా కేబినెట్ సబ్ కమిటీ నిర్ధారించినట్టు సమాచారం. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 2015 జూలై 7న రూ.329 కోట్ల అంచనా వ్యయంతో ఏపీఎస్ఎఫ్ఎల్ -ఆంధ్రపదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లలో నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. హారిజోన్ బ్రాడ్క్రాస్ట్ ఎల్ఎల్పీ సిగ్నమ్ డిజిటల్ నెట్తో టెరాసాఫ్ట్ కన్సార్టియంగా ఏర్పడి రూ.320.88 కోట్లకు బిడ్ దాఖలు చేసింది.

అయితే ఇందులో తూర్పు గోదావరి జిల్లాలో ఈ–పాస్ యంత్రాల సరఫరాలో అక్రమాలకు పాల్పడిన టెరాసాఫ్ట్ను 2015 మే 11న ఏపీటీఎస్ (ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్) బ్లాక్ లిస్ట్లో పెట్టింది. బ్లాక్ లిస్ట్లో ఉన్న సంస్థకు టెండర్లలో బిడ్ దాఖలు చేసేందుకు అర్హత ఉండదు. కానీ ఈఎంవీ (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)ల చోరీ కేసులో నిందితుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వేమూరు హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ బిడ్ను ఆమోదించాలని టీడీపీ సర్కార్ పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చారని సబ్ కమిటీ నివేదించింది. అంతటితో ఆగకుండా తక్కువ ధరకు బిడ్ దాఖలు చేసిన ఎల్–1ను కాదని అధిక ధరకు బిడ్ దాఖలు చేసిన టెరాసాఫ్ట్కు ఫైబర్ గ్రిడ్ దక్కేలా చక్రం తిప్పినట్టు కేబినెట్ సబ్ కమిటీ విచారణలో తేలింది. ఈ క్రమంలో పైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో రూ.200 కోట్లకుపైగా అవినీతి చోటు చేసుకున్నట్లు నిర్ధారిస్తూ కేబినెట్కు నివేదిక ఇచ్చింది.

ఈ స్కాంలో ప్రధానంగా ఫైబర్ గ్రిడ్ లో నాటి మంత్రి లోకేష్ ను ముందుగా బుక్ చేయాలని వైసీపీ ప్రభుత్వం ధృడ నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది.అయితే చంద్రబాబు హయాంలోనే కేంద్రం సాయంతో ఏపీలో ఫైబర్ గ్రిడ్ ను ఐటీశాఖ మంత్రిగా నాడు లోకేష్ ముందుండి మొదలుపెట్టాడు. అప్పటి ఐటీ మినిస్టర్ అయిన లోకేష్ వలన ఆ శాఖలో పెద్ద ఎత్తున అవకతవకలు అవినీతి జరిగిందని వైసీపీ ప్రభుత్వం తేల్చిందట.. ఇప్పుడు దాని మీద విచారణకు లోకేష్ కు నోటీసులు జారీ చేయడానికి వైసీపీ అధిష్టానం రెడీ అవుతోందని సమాచారం. లోకేష్ కు వచ్చే వారంలో నోటీసులు ఇస్తారు అని ఏపీ రాజధాని వర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here