పండగ చేసుకుంటున్న ఇండియన్‌ యాప్‌ డెవలపర్లు

చైనా యాప్‌లను బ్యాన్‌ చేయడంపై పలువురు భారతీయ టెక్‌ దిగ్గజ సంస్థలకు చెందిన ప్రముఖులు స్పందించారు. భారత్‌ చాలా చక్కని నిర్ణయం తీసుకుందన్నారు. ఇంతకు ముందు వరకు చైనా యాప్‌లే భారత్‌లో చక్రం తిప్పాయని, భారీ మొత్తంలో పెట్టుబడులు పెడుతూ అసలు భారతీయ యాప్‌లను మనుగడలో లేకుండా చేశాయని ఆరోపించారు. కానీ చైనా యాప్‌లను బ్యాన్‌ చేయడంతో భారతీయ డెవలపర్లు, స్టార్టప్‌లు, టెక్‌ కంపెనీలకు ప్రస్తుతం చక్కని అవకాశం లభించిందన్నారు. ప్రస్తుతం దేశంలోని ప్రజలు బ్యాన్‌ చేయబడిన చైనా యాప్‌లకు ప్రత్యామ్నాయాలు వెదుకుతున్నారని, ఇలాంటి తరుణంలో భారతీయ డెవలపర్లు దృష్టి సారించి యాప్‌లను డెవలప్‌ చేసి అందుబాటులోకి తెస్తే వృద్ధి చెందవచ్చని అన్నారు.

చైనాకు చెందిన 59 యాప్‌లను భారత్‌ నిషేధించడంపై ఇండియన్‌ స్టార్టప్‌, టెక్‌ ఇండస్ట్రీ పండగ చేసుకుంటోంది. సదరు యాప్‌లు ఇప్పటి వరకు అనేక విభాగాల్లోని భారతీయ యాప్‌లకు అసలు ఊపిరి సలపనివ్వలేదు. పెద్ద పెద్ద టెక్‌ కంపెనీలు కావడంతో భారత్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. ఇక అనేక చైనా ఫోన్లలో ఆయా యాప్‌లను ప్రీ ఇన్‌స్టాల్డ్‌గా అందించారు. దీంతోపాటు యూజర్లు చైనా యాప్‌లపైనే మోజు పెంచుకున్నారు. ఈ క్రమంలో భారతీయ యాప్‌లకు ఆదరణ కరువైంది. అయితే ఇప్పుడు మాత్రం మనోళ్లకు మంచి రోజులు వచ్చాయి.

ఇక చైనా యాప్‌ల వల్ల భారతీయ టెక్‌ స్టార్టప్‌ ఎకో సిస్టం దెబ్బతిన్నదని ఐటీ నిపుణులు వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా భారత్‌ మేల్కొన్నందుకు సంతోషంగా ఉందని, దీన్ని మన డెవలపర్లు చాలెంజ్‌గా తీసుకుని చైనా యాప్‌లకు దీటుగా యాప్‌లను డెవలప్‌ చేస్తే ఇక ఆ దేశా యాప్‌లకు ఇక్కడ మనుగడ కష్టమవుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని భారతీయ డెవలపర్లు, టెక్‌ స్టార్టప్‌లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరి దీన్ని ఎంత మంది అందిపుచ్చుకుంటారో చూడాలి..!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here