తమ్ముడి మరణం.. విమర్శలపై రవితేజ మాటిది

వివాద రహితుడైన టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ ఈ మధ్య పెద్ద అపవాదు ఎదుర్కొన్నాడు. తమ్ముడు భరత్ చనిపోతే అతడి చివరి చూపుకు కూడా రాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. తమ్ముడంటే ఇష్టం లేకే అతడి కడ చూపుకు రాలేదని ప్రచారం జరిగింది. కొందరేమో తమ్ముడిని ఆ స్థితిలో చూడలేకే రవితేజ రాలేదన్నారు. అసలు వాస్తవం ఏంటన్నది జనాలకు అర్థం కాలేదు. ఐతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో రవితేజ ఈ విషయమై ఓపెనయ్యాడు. తమ్ముడు చనిపోయిన రోజు అసలేం జరిగింది.. తానెందుకు అతణ్ని చూడటానికి రాలేదో వివరించాడు. రవితేజ ఏమన్నాడంటే..
‘‘భరత్‌ యాక్సిడెంట్లో చనిపోయాడనే వార్త తెలిసి ఇంటిల్లిపాదీ షాకయ్యాం. మా నాన్నగారి వయసు 85 ఏళ్ల పైనే. ఆయన ఆరోగ్యం అంతంతమాత్రమే. ఈ వార్త విన్న తర్వాత అదోలా అయిపోయారు. కన్న కొడుకు చనిపోయాడని వింటే ఏ తల్లి మామూలుగా ఉంటుంది? అమ్మ కుప్పకూలిపోయింది. నాన్న పరిస్థితి కొంచెం ఆందోళనకరంగానే అనిపించింది. అమ్మను సముదాయించి.. నాన్నను మామూలు స్థితికి తీసుకు రావడానికి ప్రయత్నించాం. ఈలోపు చిన్న తమ్ముడు రఘుని ఆసుపత్రికి వెళ్లి మిగతా కార్యక్రమాలు చూడమన్నాం.
భరత్‌ ముఖానికి బలమైన గాయాలు తగిలాయని తెలిసి.. మేం వాడిని అలా చూడకూడదనుకున్నాం. అందుకే వెళ్లలేదు. మా ఊహల్లో అతను ‘హ్యాపీ’గా ఉండిపోయాడు. అలాగే ఉండనివ్వాలనుకున్నాం. మాకు ఎంత బాధ ఉండి ఉంటుందో ఊహించండి. అమ్మానాన్న ఎప్పుడు మామూలు మనుషులవుతారో చెప్పలేను. మా ఇంటి పరిస్థితి అలా ఉంది. మా తమ్ముడి అంత్యక్రియల్ని ఎవరో జూనియర్ ఆర్టిస్టుతో చేయించారని రాశారు. అలా చేయించాల్సిన ఖర్మ మాకేంటండీ? నేను మా అమ్మానాన్నల దగ్గరుండిపోయా. రఘుతో చేయించకూడదన్నారు. అందుకని మా బాబాయ్‌తో అంత్యక్రియలు చేయించాం. ఆయనెవరో బయట జనానికి తెలియదు. అందుకే భరత్‌ను అనాథలా పంపించామని రాసి మమ్మల్ని అవమానించారు. చనిపోయిన వ్యక్తి గురించ ఇలా అలా రాస్తారు.. ఎలా కామెంట్లు చేస్తారు. ఇంత అమానుషంగా ఉంటారా?’’ అని రవితేజ ప్రశ్నించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here