సినిమాల్లో బయెపిక్‌లు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఇప్పుడు ప్రత్యేకంగా రాజకీయ నాయకుల బయోపిక్‌లు బాగా పాపులర్ అవుతున్నాయి. రాజకీయాల్లో కూడా బయోపిక్‌ల గురించి ఆసక్తిగా చర్చలు సాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఓ క్రీడాకారుడి బయోపిక్ కూడా అంతే చర్చ జరుగుతోంది. ఇన్ని రోజులు వద్దన్న ఆయన ఇప్పుడు బయోపిక్‌కు ఓకే అనేశాడు.
ప్రపంచ చెస్ చరిత్రలో రారాజు, మన భారతదేశానికి చెందిన విశ్వనాథన్ ఆనంద్ జీవిత కథ త్వరలో సినిమా రూపంలో మన ముందుకు రాబోతోంది. చెస్ ఆటలో ఐదుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన ఈయన బయోపిక్ తీయాలని ఎప్పటినుంచో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్‌ను సన్‌డయల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గతంలో తను వెడ్స్ మను, జీరో వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ తెరకెక్కించనున్నారు. నిజానికి విశ్వనాథన్ ఆనంద్ బయోపిక్‌ను తెరకెక్కించాలని ఎప్పటి నుండో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇన్ని రోజులు వద్దని చెబుతున్న ఆయన.. ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో తన బయోపిక్ తెరకెక్కడానికి మాత్రం ఓకే చెప్పారు. విశ్వనాథన్ చిన్నతనం నుండి గ్రాండ్ మాస్టర్‌గా ఎదిగి.. మూడు దశాబ్దాలుగా చెస్ రారాజుగా రాణిస్తున్న వైనాన్ని ఈ బయోపిక్‌లో ఆవిష్కరించనున్నారట. 2021 ప్రథమార్థంలో ఈ బయోపిక్ సెట్స్‌పైకి వెళ్లనుంది. త్వరలోనే నటీనటుల వివరాలను తెలియజేస్తారు.






