యామీ గౌతమి అనే పేరు కంటే ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌లో వచ్చే అమ్మాయిగా ఎక్కువ గుర్తింపు సంపాదించుకుంది నటి యామీ గౌతమి. తెలుగు, తమిళం, హిందీలో పలు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందీ బ్యూటీ. ఇక తాజాగా ఈ చిన్నది నటించిన ‘గిన్నీ వెడ్స్ సన్నీ’ అనే చిత్రం గురువారం ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదలకానుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన ఈ చిన్నది పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ప్రేమ, రిలేషన్ వంటి విషయాల గురించి యామీ మాట్లాడుతూ.. ‘నేను పాత స్కూల్ రొమాంటిక్ పర్సన్‌ను. ఇప్పుడున్న డేటింగ్ కల్చర్‌తో నేను పోటీ పడలేను. ఇది డిజిటల్ యుగం.. ఈ కాలంలో సరైన ప్రేమలను గుర్తించడం చాలా కష్టమైన పని. ప్రస్తుతం ప్రేమ అర్థం, దాని ప్రాముఖ్యత మారిపోయాయి. వాటితో నేను కనెక్ట్ కాలేను. ప్రస్తుతం పట్టణాల్లో అన్నీ ఉన్నాయి కానీ ఇక్కడి జీవితాల్లో ఏదో శూన్యత అలాగే ఉండిపోయింది. అదృష్టవశాత్తు స్కూల్లో కానీ, యూనివర్సిటీలో కానీ బాయ్స్ నా దగ్గరకు వచ్చే వారు కాదు. రావాలంటే భయపడేవారు.. దీనికి కారణం నేను వారిని తిరస్కరిస్తానని అనుకొని ఉండాలి.. లేదా కొడతాననుకొనైనా ఉండాలి’ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ.