సీఎం ఏర్పాటుచేసిన కాల్‌సెంట‌ర్‌కు 50 వేల ఫోన్ కాల్స్‌..

ఏపీలో అవినీతి నిరోధ‌క శాఖ దాడులు ఎక్కువ‌వుతున్నాయి. రాష్ట్రంలో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఇప్పుడు ఎదుర్కొంటున్న స‌మస్య లంచం. అయితే ఇటీవ‌లె ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి దీనిపై ప్ర‌త్యేకంగా అధికారుల‌తో మాట్లాడారు. దిశ త‌ర‌హాలో అవినీతి చేస్తున్న అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకునేలా చ‌ట్టం తీసుకురావాల‌ని ప్ర‌భుత్వం భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

స్వ‌యాన సీఎం స్థాయిలో అవినీతిపై ఉక్కుపాదం మోపాల‌ని ఆదేశాలు ఇస్తుండ‌టంతో జిల్లా ఉన్న‌తాధికారులు సైతం దీనిపై సీరియ‌స్‌గా ఉంటున్నారు. క్షేత్ర స్థాయిలో ఏ చిన్న అవినీతి అక్ర‌మాలు జ‌రిగాయ‌ని ఫిర్యాదులు వ‌చ్చినా వెంట‌నే ఎంక్వైరీ చేసి స‌ద‌రు ఉద్యోగుల‌పై చ‌ర్య‌లు తీసుకునేందుకు వెనుకాడ‌టం లేదు. అయితే ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాల్ సెంట‌ర్ కు మంచి స్పంద‌న ల‌భిస్తోంది.

అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు ఏర్పాటుచేసిన నంబ‌ర్‌కు రాష్ట్ర వ్యాప్తంగా విప‌రీత‌మైన ఫోన్ కాల్స్ వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది. ప‌ది నెల‌ల కాలంలో దాదాపు యాబై వేల కాల్స్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో కేవ‌లం అవినీతికి సంబంధించిన కాల్స్ దాదాపు రెండు వేలు ఉన్న‌ట్లు స‌మాచారం. అధికారులు సైతం స‌మాచారం వ‌చ్చిన వెంట‌నే స‌ద‌రు అధికారుల‌పై నిఘాను ఉదృతం చేశారు. దీంతో ప్ర‌జ‌ల్లో కూడా ఏసీబీపై న‌మ్మ‌కం ఏర్ప‌డింది. పైగా జ‌నాల్లో చైత‌న్యం వ‌చ్చింద‌ని చెప్పొచ్చు. గ‌తంలో కూడా అవినీతి నిరోధ‌క శాఖ ఉన్న‌ప్ప‌టికీ ఈ ప్ర‌భుత్వం వ‌చ్చాక ప్ర‌జ‌ల నుంచి కాల్స్ ఎక్కువ‌య్యాయ‌ని తెలుస్తోంది. మ‌రి సీఎం కోర‌కున్న‌ట్లు రాష్ట్రంలో అవినీతి లేకుండా ఉండే రోజులు రావాల‌ని అంద‌రూ కోరుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here