విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం దగ్గర పడింది. ఇప్పటికే ఇది ప్రారంభం కావాల్సి ఉండగా మాజీ రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ మృతి వల్ల ఆగిపోయింది. దీంతో ప్రారంభానికి కొత్త తేదీని ప్రకటించారు.
ఈనెల 18వ తేదీన కనకదుర్గ ఫ్లై ఓవర్‌ను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ ఫ్లై ఓవర్‌ను ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తారు. ఈమేరకు ఎంపీ కేశినేని నానికి కేంద్రమంత్రి కార్యాలయ నుంచి సమాచారం వచ్చింది. వాస్తవానికి ఈ నెల 4వ తేదీననే దీన్ని ప్రారంభించాల్సి ఉంది..
అయితే మాజీ రాష్ట్రపతి మృతితో కేంద్రం వారం రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించడంతో ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆగిపోయింది. దీంతో పార్లమెంటు సమావేశాలు ఉన్నప్పటికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించనున్నారు. ఇదిలావుంటే కనకదుర్గ ఫ్లై ఓవర్ విషయంలో ఇప్పటికే అధికార వైసీపీ, ప్రతిపక్ష టిడిపి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇటీవల ఇరు పార్టీలకు చెందిన నేతలు దీనిపై కామెంట్లు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మరోసారి ప్రారంభం తేదీ ఖరారు అవ్వడంతో కనకదుర్గ ఫ్లై ఓవర్ పై రాజకీయాలు ఏ విధంగా ఉండనున్నాయో వేచి చూడాలి.