ఆంధ్ర ప్రదేశ్ వచ్చిన ప్రతీ సారీ వెంకయ్య నాయుడు కారణం చెప్పుకుని తీరాల్సిందే నా ?

నిన్నంతా మీడియా హడావిడి ఇవాంక ట్రంప్ , మోడీ మీదనే ఉంది కానీ ఏపీ కి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు వచ్చారు అని చాలా మందికి తెలీదు. రెండో సారి ఉపరాష్ట్రపతి హోదాలో ఆయన ఆంధ్రా లో కనపడ్డారు. అమరావతి దగ్గర వీ ఐ టీ కాలేజీ ని ఆయన ఓపెన్ చేసారు ఆయన. ముఖ్యమంత్రి చంద్రబాబు తో కలిసి ఈ ప్రారంభం చేసిన ఆయన కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు . ” గూగుల్ కన్నా గురువు అనేవాడు చాలా ముఖ్యం ” అంటూ చెప్పుకొచ్చిన వెంకయ్య నాయుడు అమరావతి లో విజ్ఞాన కేంద్ర మొదలు అవ్వడానికి చంద్రబాబు ముందు చూపే కారణం అని పొగడ్తల లో ముంచేశారు.

ఆయన నాయ‌క‌త్వంలో ఎన్నో విద్యా సంస్థ‌లు రాష్ట్రానికి రావ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. అమ‌రావ‌తి ఒక్క రాజ‌ధాని మాత్ర‌మే కాద‌నీ, నాలెడ్జ్ హ‌బ్, హెల్త్ హ‌బ్ గా మారుతోంద‌ని అన్నారు. తరచూ ఏపీ కి తాను రాలేని పరిస్థితులు ఉన్నా కూడా రావడానికి కారణం ఏపీ మీద తనకి ఉన్న ప్రేమే అని చెప్పుకొచ్చారు వెంకయ్య. త‌న సిబ్బంది గురించి మాట్లాడుతూ.. ‘మీరు శంకుస్థాప‌న చేసిన భ‌వ‌నానికి మ‌ళ్లీ మీరే వెళ్లి ఉప రాష్ట్రప‌తి హోదాలో ప్రారంభించ‌డం అంత ఇదిగా ఉండ‌ద‌ని మావాళ్లు చెప్పారు. అయితే, ఇంత త‌క్కువ కాలంలో నిర్మాణం పూర్త‌యింది కాబ‌ట్టి ప్రారంభోత్స‌వానికి నేను వెళ్తాన‌ని వారికి చెప్పాను’ అన్నారు వెంక‌య్య‌.

ఇక్క‌డికి రావ‌డానికి మ‌రో కార‌ణం ఉంద‌నీ, ముఖ్య‌మంత్రి నిర్మిస్తున్న రాజ‌ధానికి అన్ని వ‌స‌తులు, అన్ని సొగ‌బులు, అన్ని హంగులూ క‌ల్పించ‌డంలో త‌న వంతు కూడా కొంత ప్ర‌య‌త్నం చేయాల‌న్న ఉద్దేశంతో రావ‌డం జ‌రిగింద‌న్నారు. ఉపరాష్ట్రపతి గా ఆయన ఎన్నిక అయ్యి దేశానికి అత్యున్నత సేవలు అందిస్తున్నారు, అయితే ఏపీ కి వచ్చిన ప్రతీ సారీ ఆయన ఎందుకు వచ్చాను అనేది చెప్పుకుంటారు. నిజానికి, ఆయ‌న ఆంధ్రాకు వ‌చ్చిన ప్ర‌తీ సంద‌ర్భంలోనూ ఎందుకొచ్చానో అనే వివ‌ర‌ణ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఏముంది..? అంటే, ఈ వివ‌ర‌ణ కేంద్రానికి ఇస్తున్నారేమో అనుకోవాలి. ‘నేను ఆంధ్రాకు వెళ్ల‌డానికి ఇన్ని కార‌ణాలున్నాయి చూడండీ’ అని వారికి చెబుతున్న‌ట్టుగా అనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here