సీఐపై వీహెచ్ బూతు పురాణం..అరేయ్‌ న‌న్నే అపుతావారా?

“అరే.. నువ్వు ఎవడ్రా బై నాకు చెప్పేది!. నన్నే అడ్డుకుంటావా?. ఆరేయ్‌…నీ అంతు చూస్తా” ఇది  కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న సీఐపై ఉప‌యోగించిన మాట‌లు. వీహెచ్ ఇంత‌గా ఊగిపోవ‌డానికి కార‌ణం నిబంధ‌న‌లు పాటించాల‌ని సీఐ కోరడ‌మే. అస‌లేం జ‌రిగిందంటే…అసెంబ్లీ స‌మావేశాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో అక్క‌డి మీడియా పాయింట్ వ‌ద్ద మాట్లాడేందుకు వీహెచ్ వెళ్లారు. ఈ క్ర‌మంలో వీహెచ్‌ను కామాటిపుర అదనపు ఇన్‌స్పెక్టర్‌ పాములపర్తి సుధాకర్‌ అడ్డుకున్నారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం స‌భ‌లోని ప్ర‌స్తుత సభ్యులే మాట్లాడాలని, మాజీలకు అవకాశం లేదని సుధాకర్‌ మర్యాదపూర్వకంగా చెప్పినా వీహెచ్‌ వినిపించుకోలేదు.
 
మ‌రోమారు సీఐ సుధాకర్ చెప్పినా వినిపించుకోకుండా ఆయ‌న‌పై వీహెచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నన్ను ఆపడానికి నీవు ఎవడ్రా?  మేం మాట్లాడ‌టానికి కూడా మీ అనుమ‌తి కావాలా?’ అంటూ సీఐను వీహెచ్ బూతులు తిట్టారు. తన పట్ల వీహెచ్ ప్రవర్తించిన తీరుకు సీఐ తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. ఎస్సీ కులానికి చెందిన తనను వీహెచ్ కులం పేరుతో దూషించారని ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లానని… అయినా ఎవరూ పట్టించుకోలేదని వాపోయారు. ఉద్యోగానికి రాజీనామా చేస్తానంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. తన సొంత డిపార్ట్ మెంట్ లోనే తనకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
 
అనంత‌రం ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. డ్యూటీలో ఉన్న తనను దూషించిన వీహెచ్‌పై శుక్రవారం సైఫాబాద్‌ పోలీసు స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, ఐపీసీ 353, 294-బి, 504 సెక్షన్ల కింద వీహెచ్‌పై కేసు నమోదు చేశారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here