అనుష్క నిశ్శబ్దం ఎలా ఉందంటే..!

టైటిల్‌: నిశ్శబ్దం
బ్యానర్‍:
 పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ
నటీనటులు: అనుష్క, మాధవన్‍, అంజలి, మైఖేల్‍ మాడ్సన్‍, సుబ్బరాజు, షాలిని పాండే, తదితరులు
కథనం: కోన వెంకట్‍
సంగీతం: గోపి సుందర్‍
నిర్మాత: టి.జి. విశ్వప్రసాద్‍
కథ, దర్శకత్వం: హేమంత్‍ మధుకర్‍

కరోనా కారణంగా థియేటర్లు మూత పడడంతో కొందరు దర్శకనిర్మాతలు ఓటీటీ బాటపడుతున్న విషయం తెలిసిందే. అయితే చిన్న చిన్న సినిమాలు ఓటీటీలో విడుదలైతే ఏదో అనుకోవచ్చు కానీ భారీ తారాగణంతో, అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలను ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో విడుదల చేయడమంటే అంత ఆశామాషీ విషయం కాదు. ఇలాంటి సాహసాన్ని టాలీవుడ్‌లో తొలుత ‘వి’ చిత్ర యూనిట్‌ చేస్తే.. ఇప్పుడు అనుష్క కథానాయికగా నటించిన ‘నిశ్శబ్దం’ చిత్ర యూనిట్‌ చేసింది. నిజానికి ఈ చిత్ర దర్శకనిర్మాతలు చివరి క్షణం వరకు సినిమాను థియేటర్లలోనే విడుదల చేయడానికి ప్రయత్నించారు. కానీ థియేటర్ల ప్రారంభంపై ఎలాంటి స్పష్టత రాకపోవడంతో చివరికి ఓటీటీలో విడుదల చేయక తప్పలేదు. నిశ్శబ్దం చిత్ర డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమేజాన్‌ దాదాపు రూ.25 కోట్లకు కొనుగోలు చేసింది. బహుశా ఒక తెలుగు సినిమాను ఓటీటీ సంస్థ ఇంత పెట్టి కొనుగోలు చేయడం ఇదే తొలిసారి కావొచ్చు. మరి అక్టోబర్‌ 2న డిజిటల్‌ ప్రీమియర్‌గా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందిలాంటి వివరాలు ఈరోజు మూవీ రివ్యూలో చూద్దాం..

కథ..

నిశ్శబ్దం కథ మొత్తం అమెరికాలో జరుగుతుంది. సాక్షి (అనుష్క), సోనాలి (షాలీని పాండే) ఇద్దరు మంచి స్నేహితులు. సాక్షి తండ్రి నడిపించే ఓ అనాథ పాఠశాలలో వీరిద్దరు కలిసి పెరగడంతో, ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంతగా మారతారు. అయితే సాక్షి జీవితంలోకి ఆంటోనీ (మాధవన్‌) రావడంతో సోనాలీ తట్టుకోలేకపోతుంది. ఇదిలా ఉంటే ఓ రోజు సాక్షి, ఆంటోనీలు కలిసి అమెరికాలోని సియాటెల్‌కు 70 కి.మీల దూరంలో ఉన్న వుడ్‌సైడ్‌ విల్లాకు వెళ్తారు. అయితే అక్కడ అప్పటికే ఓ జంట హత్యకు గురవుతుంది. ఈ కేసును పోలీసులు ఛేదించలేకపోతారు. ఆ ఇంటి యజమాని ఆత్మ వారిని చంపేసిందంటూ ప్రచారం జరుగుతుంది. అప్పటి నుంచి ఆ విల్లాను ఎవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రారు. అలాంటి ఇంటిలో ఉన్నో ఓ అరుదైన పెయింటింగ్‌ను గీయడానికి సాక్షి, ఆంటోని కలిసి వెళ్తారు.  కొద్దిసేపటికే ఆంటోని హత్యకు గురవుతాడు..! సాక్షి మాత్రం ప్రాణాలతో బయపడుతుంది. ఇంతకీ ఆ హత్య చేసింది ఎవరు? పోలీస్‌ ఆఫీసర్‌ అయిన రిచర్డ్‌ (మైఖేల్‌ మాడ్సన్‌), క్రైమ్‌ డిటెక్టివ్‌ మహాలక్ష్మి(అంజలి)తో కలిసి ఎలా ఛేదించారు. ఈ హత్యకూ సోనాలి(షాలినీ పాండే), వివేక్‌(సుబ్బరాజు)లకు ఉన్న సంబంధం ఏంటి? లాంటి వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే.?

దర్శకుడు ‘నిశ్శబ్దం’ కథను చాలా బాగా రాసుకున్నారు. అయితే ఇలాంటి కథకు అద్భుతమైన స్క్రీన్‌ప్లే తోడుంటే సినిమా ఓ రేంజ్‌లో ఉంటుంది. కానీ నిశ్శబ్దంలో అదే లోపించిందా అనిపిస్తుంది. థ్రిల్లర్‌ మూవీలంటేనే సినిమా చివరి వరకు సస్పెన్స్‌ వీడకుండా ఉంటాయి. అలాంటిది నిశ్శబ్దంలో మాత్రం సినిమా మధ్యలోనే సస్పెన్స్‌ తెలిసిపోతుంది. ఆంటోనీని హత్య చేసింది ఎవరనే సస్పెన్స్‌ తెలిసిపోయిన తర్వాత జరిగేదంతా ప్రేక్షకుడి ఊహకు అందేలా ఉంటుంది. అయితే మధ్య మధ్యలో వచ్చే కొన్ని ట్విస్ట్‌లు మాత్రం ఆకట్టుకుంటాయి. మాధవన్‌, అనుష్కల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. కొన్ని సన్నివేశాలు నత్తనడకగా సాగుతుంటాయి. ఇవి సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని కాస్త ఇబ్బంది పెడుతుంటాయి. కొన్ని సీన్స్ పెద్దగా ఆసక్తిగా లేకపోవడం కూడా సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు.

ఎవరెలా నటించారు.?

ఇక ఈ సినిమాలో నటీనటుల విషయానికొస్తే.. లేడి ఓరియెంటెడ్‌ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్న నటి అనుష్క, ఇందులోనూ తనదైన ప్రతిభను కనబరిచారు. చెవిటి, మూగ అమ్మాయిగా అనుష్క బాగా నటించారు. షాలీని, మాధవన్‌, అంజలి, సుబ్బరాజు, మైకేల్‌ మ్యాక్సిన్‌లు తమ పరిధి మేర పాత్రలకు న్యాయం చేశారు. మాధవన్‌ మంచి నటనను కనబరిచారు. ఇక హాలీవుడ్‌ నటుడు మైకేల్‌ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. నేపథ్య సంగీతం ఆకకట్టుకుంటుంది. సిధ్‌ శ్రీరామ్‌ పాడిన ‘నిన్నే నిన్నే’ ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.

ప్లస్‌..

  • అనుష్క నటన
  • కథ

మైనస్‌.. 

  • సెకండాఫ్‌
  • నెమ్మదిగా సాగే కథనం

చివరగా: కొన్ని సాగదీత సన్నివేశాలు తగ్గించి, స్క్రీన్‌ప్లేపై దృష్టిపెడితే నిశ్శబ్దం.. ‘దద్దరిల్లేది’.

రేటింగ్‌:

2.5

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here