తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీనరసింహా స్వామి ఆలయంలోని రథం దగ్ధం అవ్వడంతో ఒక్కసారిగా హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. నేడు అంతర్వేదిలో ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వెళ్లిన మంత్రుల బృందానికి విశ్వహిందూపరిషత్, భజరంగ దళ్ నేతలు నిలదీశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ, పినిపె విశ్వరూప్లు అంతర్వేదికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఘటన ఎలా జరిగిందన్న దానిపై విచారణ జరుగుతోందని తెలిపారు. వచ్చే కళ్యాణోత్సవం సమయానికంతా నూతన రథాన్ని నిర్మిస్తామని తెలిపారు. అనంతరం అక్కడి నుంచి మంత్రులు తిరుగు ప్రయాణం అవుతుండగానే మార్గమద్యంలో హిందూ సంఘాలు అడ్డుకున్నాయి.
ఘటనలో కుట్ర కోణం ఉందని నిరసన కారులు కేకలు వేశారు. పోలీసులు ఏర్పాటుచేసిన భారీకేడ్లను కూడా దాటుకొని ముందుకు రావడంతో అక్కడ పరిస్థితులు అదుపు తప్పాయి. దీంతో వెంటనే మంత్రులను ఆలయంలోకి తీసుకెళ్లారు. కాగా ఈ ఘటనలో ఇప్పటికే ఆలయ ఇన్చార్జి సహాయ కమీషనరును విధుల నుంచి తొలగించారు. మరో ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.






