ఏపీలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మహిళలు, చిన్నారుల ఆరోగ్యం కోసం తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు.
గత ప్రభుత్వం కంటే మెరుగ్గా పని చేస్తున్నామని మంత్రి బాలినేని అన్నారు. గతంలో మహిళలు, చిన్నారులకు పోషకాహారం అందించేందుకు రూ. 500 కోట్లు ఖర్చుచేసిందన్నారు. తమ ప్రభుత్వం ఇందుకోసం రూ. 1,863 కోట్ల రూపాయల ఖర్చు చేస్తోందని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు ఇచ్చిన హామీలన్నీ తాము అమలు చేస్తున్నట్లు బాలినేని గుర్తు చేశారు. ఈ నెల 11వ తేదీన డ్వాక్రా మహిళలకు ఆసరా పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు మంత్రి చెప్పారు. డ్వాక్రా మహిళలకు రూ. 6వేల 2 వందల కోట్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అంత బాగోలేకపోయినా సీఎం జగన్ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తుండటంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులో ఉన్నా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా జగన్ ముందుకు వెళుతున్నారని పార్టీ నేతలతో పాటు పబ్లిక్ డిస్కస్ చేసుకుంటున్నారు.






