అలా డబ్బులిచ్చేది నేను కాదు

ప్రస్తుతం కరోనా సంకెళ్లలో ప్రపంచం మొత్తం బందీ అయిపోయింది.  ఈక్రమంలో ఎక్కడి వారు అక్కడే  అన్నట్లు లాక్ అయిపోగా పేద, మధ్యతరగతి రేఖన ఉన్న రోజువారీ కూలీలు, రైతులు, చిరుద్యోగ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారి కోసం ఎందరో దాతలు ముందుకొచ్చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతు  సాయం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ తారలు భారీ విరాళాలను అందించారు. కొంతమంది విరాళాలు ఇవ్వకుండా నేరుగా ప్రజలను అదుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ పర్ఫెక్షనిస్టు అమీర్ ఖాన్ చేసినట్లు చెప్పుకుంటున్న ఓ పని అంతర్జాలంలో బాగా వైరల్ అయింది. అదేంటంటే…
మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు కలిసి పేదవారికి ఉచితంగా రెండు కిలోల గోధుమ పిండిని అందించడం జరిగింది. వాటిని అందుకున్న వారు ఇంటికి వెళ్లిన తర్వాత ఆ పొట్లాలను విప్పి చూస్తే అందులో పదిహేను వేల రూపాయల నగదు ఉన్నట్లు గ్రహించారట. దీంతో ఇలా పేదలను ఆదుకున్నది మరెవరో కాదు అమీర్ ఖానే అంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు షికారు చేశాయి. ఆ నోటా ఈ నోటా ఈ వార్త అమీర్ ఇంటికి చేరడంతో తన ట్విట్టర్ ద్వారా అమీర్ స్పందించాల్సి వచ్చింది. ఇలా పేదలకు డబ్బును అందించింది తాను కాదన్న అమీర్ అతడెవరో రాబిన్హుడ్ అయ్యుంటాడని ట్విట్టర్లో పేర్కొన్నాడు. అయితే చేసిన సాయం గురించి చెప్పుకునే అలవాటు లేని అమీర్ అబద్దం ఆడుతున్నాడని అతడి అభిమానులు అంటుంటే… ఏదైతేనేం పేదవారికి ఏదో ఒక రూపంలో సాయం అందింది కదా అని కొందరంటున్నారు.
ఇక అమీర్ సినిమాల విషయానికి వస్తే, అతడు నటిస్తున్న ‘లాల్సింగ్ చడ్డా’ ఈ ఏడాది క్రిస్మస్కి వస్తుందని భావించగా కరోనా లాక్డౌన్ కారణంగా వచ్చే ఏడాది విడుదల కావచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here