తెలంగాణ ఆర్టీసీ కార్గో సర్వీసులు ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి

తెలంగాణ ఆర్టీసీ పార్సిల్, కొరియర్ అండ్ కార్గో సర్వీసులను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీలో ప్రైవేట్ సేవలు రద్దు చేశామని.. కార్గో, పార్సిల్ విభాగానికి కృష్ణకాంత్‌ను ప్రత్యేక అధికారిగా నియమించినట్లు తెలిపారు.

కార్గో సేవలు అందుబాటులోకి వచ్చాయని… ఇక ఈరోజు నుంచి పార్సిల్ సేవలను కూడా మొదలుపెడుతున్నట్లు వెల్లడించారు. ఆర్టీసీలో ప్రయాణానికి మంచి స్పందన ఉందని.. అలాగే వస్తువుల రవాణాపై కూడా నమ్మకం ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తద్వారా రూ. 180- 200 కోట్ల బిజినెస్ చేసే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ సిబ్బందిని ఈ సేవల్లో వాడుకుంటామని.. త్వరలోనే మొబైల్ యాప్ కూడా తీసుకొస్తామని పువ్వాడ తెలిపారు.

అన్ని బస్‌స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. అదే విధంగా.. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కూడా బుకింగ్‌లు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇందుకు సంబంధించి త్వరలోనే జీవో తీసుకురానున్నట్లు వెల్లడించారు.కాగా ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఇప్పటి వరకు ఆర్టీసీలో కొనసాగుతున్న ప్రైవేట్ పార్సిల్‌ ఏజెన్సీల ఒప్పందాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు. లాక్‌డౌన్ సమయంలో సేవలందించిన కార్గో బస్సులు.. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల మధ్య నిత్యావసర వస్తువులు, అంగన్వాడీ వస్తువులను సరఫరా చేసిన విషయం తెలిసిందే.

ఈ విషయం గురించి ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ మాట్లాడుతూ.. తెలంగాణ ఆర్టీసీ పార్సిల్, కొరియర్ అండ్ కార్గో సర్వీసులు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో.. ఆర్టీసీకి మంచి ఆదాయం ఉంటుందన్నారు. దశల వారీగా పార్సిల్, కొరియర్ సర్వీసులను తీసుకొస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here